Monday, 11 July 2016

వైర్‌ లెస్‌ ఫోన్లు, మైక్రోఫోన్లలో మనం మాట్లాడితే ఎలా వినిపిస్తుంది?

ప్రశ్న: వైర్‌ లెస్‌ ఫోన్లు, మైక్రోఫోన్లలో మనం మాట్లాడితే ఎలా వినిపిస్తుంది?

జవాబు: వైర్‌లెస్‌ ఫోన్లను కార్డ్‌లెస్‌ ఫోన్లు అని కూడా అంటారు. వింటూ, మాట్లాడే హేండ్‌సెట్‌కు మనం నంబరు డయల్‌ చేసే బేస్‌సెట్‌కు మధ్య విద్యుత్‌ తీగ ( wire or cord) ఉంటే అది మామూలు ఫోను. ఈ రెండు సాధనాల మధ్య తీగలేవీ లేకుండా బేస్‌సెట్‌నుంచి దూరంగా హేండ్‌సెట్‌ను పట్టుకుని గదిలో మనం అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడగలిగితే ఆ వ్యవస్థను కార్డ్‌లెస్‌ ఫోను అంటారు. ఇందులో హేండ్‌సెట్‌కు, బేస్‌సెట్‌కు మధ్య రేడియో తరంగాల ద్వారాగానీ, సూక్ష్మతరంగాల ద్వారాగానీ సమాచార రవాణా డిజిటల్‌ పద్ధతి అనే ఎలక్ట్రానిక్‌ ప్రక్రియ ద్వారా వీలవుతుంది. అందుకే హేండ్‌సెట్‌లోను, బేస్‌సెట్‌లోను రెంటిలో విద్యుచ్ఛక్తిని ఇచ్చే బ్యాటరీ ఉండాలి. సాధారణంగా బేస్‌సెట్‌ను ఏదైనా అడాప్టర్‌ (adopter)ద్వారా ఇంట్లో స్విచ్‌ బోర్డు ద్వారా ప్రత్యక్ష విద్యుత్తు (dc)ని అందిస్తారు. హేండ్‌సెట్‌లో రీఛార్జబుల్‌ బ్యాటరీలు ఉంటాయి. ఇందులోని బ్యాటరీలలో విద్యుత్‌ శక్తి తగ్గినపుడు తిరిగి రీఛార్జి చేసుకోవచ్చు. బేస్‌సెట్‌కే సెల్‌ఫోన్‌ వైరును కలపడం వల్ల అక్కడ్నించి మనం మాట్లాడే మాటలు తిరిగి విద్యుత్తు ప్రవాహ సంకేతాలుగా మారి అవతలి వ్యక్తికి చేరతాయి.
మైక్రోఫోను అనే మైకును వైర్లు ఉన్నా లేకున్నా మైక్రోఫోను అనే అంటారు. కార్డ్‌లెస్‌ ఫోను పద్ధతిలోనే మైక్రో ఫోనును ఉపయోగించగలిగితే అపుడు దాన్ని కార్డ్‌లెస్‌ మైక్రోఫోను లేదా కార్డ్‌లెస్‌ అనడం కద్దు. మనం మాట్లాడిన మాటలు తొలుత విద్యుత్తు ప్రవాహ సంకేతాలుగా మారతాయి. ఆ తర్వాత అవి రేడియో తరంగాలు లేదా మైక్రోవేవ్‌ తరంగాలుగా మారి స్పీకర్లకు అందించే ఆంప్లిఫియర్‌ దగ్గర ఉన్న బేస్‌ స్టేషను అనే ఎలక్ట్రానిక్‌ పరికరాన్ని చేరతాయి. అక్కడ అవి తిరిగి విద్యుత్తు ప్రవాహ సంకేతాలుగా మారి స్పీకర్లలో అధిక స్థాయిలో శబ్దాన్ని ఇస్తాయి.

www.bhaskerdesh.in

Sunday, 10 July 2016

సూర్యుడు, గ్రహాలు, భూమి, నక్షత్రాలు అన్నీ గుండ్రంగానే ఉంటాయెందుకని?

ప్రశ్న:
సూర్యుడు, గ్రహాలు, భూమి, నక్షత్రాలు అన్నీ గుండ్రంగానే ఉంటాయెందుకని?

జవాబు:
నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడిన తొలి దశలో అవన్నీ కొంతవరకు ద్రవరూపంలోనే, అత్యంత ఉష్ణోగ్రతలతో ఉండేవి. ఆపై క్రమేణా చల్లబడి కొన్ని గ్రహాలు ఘనరూపం దాల్చగా, నక్షత్రాలు ఇంకా చాలావరకూ ద్రవ, వాయు రూపంలోనే ఉన్నాయి. గ్రహాలు, నక్షత్రాలలో ఉండే గురుత్వాకర్షణ శక్తి వాటి కేంద్రాల నుంచి ఉత్పన్నమవడంతో వాటిలోని వివిధ కణాలు వాటి కేంద్రాల వైపు ఆకర్షితమవుతాయి. ఉష్ణోగ్రతలు తగ్గి చల్లబడిన తర్వాత కూడా అంతర్భాగాలలో విచ్ఛిన్నమవుతున్న రేడియో ధార్మిక మూలకాల వల్ల గ్రహాల లోనూ, కేంద్రక సంయోగం (న్యూక్లియర్‌ ఫ్యూజన్‌) వల్ల నక్షత్రాల లోను ఉష్ణం పుడుతూనే ఉంది. అందువల్ల గ్రహాల అంతర్భాగంలోని పదార్థాలు, నక్షత్రాల లోని పదార్థాలు ఇప్పటికీ ద్రవరూపంలోనే ఉన్నాయి. ఈ పదార్థాలు కూడా గురుత్వాకర్షణ వల్ల వాటి కేంద్రాల వైపే ఆకర్షితమవుతూ ఉంటాయి. ఈ ఆకర్షణ అన్ని భాగాలపైనా ఒకే విధంగా ఉండడం వల్ల నక్షత్రాలు, గ్రహాలు గోళాకార రూపం దాల్చాయి. గణిత భావనల ప్రకారం ఆదర్శవంతమైన సౌష్ఠవరూపం గోళాకారమే.

చల్లని ఏసీ ఎలా పుట్టిందో? ఏసీని ఎవరు కనిపెట్టారు?, ఎందుకు పనికి వస్తుందో?

ప్ర : చల్లని ఏసీ ఎలా పుట్టిందో? ఏసీని ఎవరు కనిపెట్టారు?, ఎందుకు పనికి వస్తుందో?

జ :చల్లటి గాలిని ఇచ్చే ఏసీ (కండిషనర్ )అంటే ఇష్టం ఉండనిది ఎవరికి? కానీ, ఈ ఏసీ మొదట్లో కేవలం పరిశ్రమల కోసమే పుట్టిందంటే నమ్ముతారా? ఏసీ మొదట్లో ఒక ముద్రణ (ప్రింటింగ్) పరిశ్రమ కోసమే పుట్టింది. అమెరికాలోని బ్రూక్‌లీన్ ప్రింటింగ్ సంస్థలో వేడి, తేమల మూలంగా చాలా ఇబ్బందులు ఏర్పడేవి. ముద్రించిన తర్వాత రంగులు అల్లుకుపోవడం లాంటివి జరిగేవి. దీనిని అప్పుడే కొత్తగా ఉద్యోగంలోకి చేరిన ఒక యువకుడు గమనించాడు. గాలిని చల్లబరిచే ఒక పరికరాన్ని చేసి యజమానికి చూపించాడు దాంతో ప్రింటింగ్ త్వరగా పూర్తి కావడమే కాదు నాణ్యత కూడా పెరగడంతో ఆయన బోలెడు సంతోషించాడు. అదే మన మొట్టమొదటి ఏసీ అన్నమాట. ఆ ఉద్యోగి పేరు విల్లిస్ హావిల్యాండ్ క్యారియర్. 'ఫాదర్ ఆఫ్ ఏసీ'గా పేరు తెచ్చుకున్న క్యారియర్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగంలో చేరిన ఏడాదిలోనే ఏసీని కనిపెట్టాడు. అప్పట్లో ఆయన జీతం వారానికి 10 డాలర్లు మాత్రమే!

క్యారియర్ 1906లో ఏసీ మీద పేటెంట్ సాధించాడు. అప్పటి నుంచి రకరకాల పరిశోధనలు చేసి మరింత మెరుగు పరచాలని చూస్తుండేవాడు. రేషనల్ సైక్రోమెట్రిక్ అనే ఒక కొత్త సూత్రాన్ని రూపొందించి 1911 లో అమెరికాలోని ఇంజనీరింగ్ సొసైటీకి అందించాడు. ఇప్పటికీ ఈ సూత్రమే ఏసీల తయారీకి ప్రధానమైన ఆధారం. ఈ ఆలోచన ఆయన చాలా చిత్రంగా వచ్చింది. క్యారియర్ ఒకసారి రాత్రిపూట రైలు కోసం చూస్తున్నాడు. అప్పుడు బాగా మంచు కురుస్తుంది. ఇంతలో రైలు రావడంతో మంచు స్థానాన్ని వేడిగాలి ఆక్రమించింది. వేడి, తేమ, మంచుల మధ్య ఉండే సంబంధాన్ని గుర్తించాడు. వేడిగాలి మూలంగా మంచు చెదిరినప్పుడు. చల్లగాలిని వేగంగా పంపిస్తే వేడిని తగ్గించవచ్చని గ్రహించాడు. అదే ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

పరిశ్రమల్లో ఏసీ బాగా ప్రాచుర్యం పొందడంతో క్యారియర్ ఒక కంపెనీని ఏర్పాటుచేశాడు. రకరకాల పరిశోధనలు చేసి ఆరోగ్యానికి హాని కలిగించని 'సెంట్రిప్యుగల్ రిఫ్రిజిరేషన్' యంత్రాన్ని తయారుచేశాడు. దీంతో విశాలమైన ప్రాంతాల్లో కూడా చల్లదనాన్ని కలిగించడానికి అవకాశం ఏర్పడింది. దాంతో వాణిజ్య సముదాయాలు, థియేటర్లలో వాడకం మొదలైంది. ఆతర్వాత చిన్న చిన్న ఏసీల తయారీకి గిరాకి పెరగడంతో 1928 లో ఇంట్లో వాడుకునే 'వెదర్ మేకర్ ' ని సృష్టించాడు. అదే ఇప్పుడు రకరకాల మార్పులతో ప్రపంచమంతా వ్యాపించింది అన్నమాట.

www.bhaskerdesh.in

Saturday, 9 July 2016

ప్రాజెక్టులకు సంబంధించి వచ్చే నీరు (ఇన్‌ఫ్లో), బయటకు విడుదల చేసే నీటిని (ఔట్‌ఫ్లో) క్యూసెక్కులలో కొలుస్తారు. క్యూసెక్కు అంటే ఏమిటి? దాన్ని ఎలా కొలుస్తారు?

ప్ర్రశ్న: ప్రాజెక్టులకు సంబంధించి వచ్చే నీరు (ఇన్‌ఫ్లో), బయటకు విడుదల చేసే నీటిని (ఔట్‌ఫ్లో) క్యూసెక్కులలో కొలుస్తారు. క్యూసెక్కు అంటే ఏమిటి? దాన్ని ఎలా కొలుస్తారు?

జవాబు: ద్రవాల ఘనపరిమాణానాన్ని బ్రిటిష్‌ కొలమానమైన fps (foot-pound-second) ప్రమాణాలతో ఘనపుటడుగు (cubic foot) లలో కొలుస్తారు. ఒక్క సెకను కాలంలో ఎన్ని ఘనపుటడుగులు ప్రవాహం ద్వారా ప్రయాణిస్తున్నాయో ఆ సంఖ్యను క్యూసెక్కు (cubic feet per second) అంటారు. cubic feet per లోని cu భాగాన్ని secondలోకి sec ముక్కను కలిపి కుట్టితే ఏర్పడిన సంధి పదం cusec. ఒక సెకను కాలంలో ఒక ఘనపుటడుగు చొప్పున ప్రవాహం ఉన్నట్లయితే అది ఒక క్యూసెక్కు ప్రవాహం అన్నమాట. ఇది సుమారు 28 లీటర్లకు సమానం. అంటే ఒక రంధ్రంగుండా సుమారు 28 లీటర్లు (28.316847 లీటర్లు శాస్త్రప్రకారం) ఒక్క సెకనుకు ప్రవాహం ఉంటే దాన్ని ఒక క్యూసెక్కు అంటారు.

ఏసి యంత్రం నుంచి గాలి చల్లగా ఎలా వస్తుంది? ఆ గాలి ఆరోగ్యానికి మంచిదేనా

ప్రశ్న: ఏసి యంత్రం నుంచి గాలి చల్లగా ఎలా వస్తుంది? ఆ గాలి ఆరోగ్యానికి మంచిదేనా?

జవాబు: వాయువుల్లో వాస్తవ వాయువులు (Real Gases) ఆదర్శ వాయువులు(Ideal Gases) అనే రెండు రకాలున్నాయి. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో వీటిని పరస్పరం మార్చుకోవచ్చును. ఇందులో వాస్తవ వాయు ధర్మాల్లో ఓ ప్రధాన ధర్మం జౌల్‌ థామ్సన్‌ గుణకం. ఓ వాయువును బాగా సంపిలినీకరణం (Compression) చేశాక ఒక్కసారిగా విరళీకరణా(expansion)నికి గురిచేస్తే ఆ వాయువు ఉష్ణోగ్రత పడిపోయే ధర్మానికి జౌల్‌ థామ్సన్‌ గుణకం ఓ కొలబద్ద. ఇది క్లోరో ఫ్లోరో కార్బన్‌ బృందానికి చెందిన ఫ్రియాన్‌ వాయువుకు చాలా ఎక్కువ. అందుకే ఏసీ యంత్రాల తయారీలో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. ప్రత్యేక మోటారుతో మొదట ఫ్రియాన్‌ వాయువును అధిక పీడనానికి లోను చేస్తారు. అలా అధిక పీడనంలో ఉన్న ఫ్రియానును జల్లెడలాగా అంటే గొట్టాల చట్రంలోకి విస్తరించినపుడు ఆ గొట్టాలు చల్లబడతాయి. ఆ గొట్టాల మీదుగా గాలి పదేపదే చక్రీయంగా (Cyclically) వెళ్లేలా చేయడం వల్ల గదిలో గాలి క్రమేణా కూడా చల్లబడుతుంది. ఏసీ యంత్రాలు, రిఫ్రిజరేటర్లు పనిచేసేది ఈ యంత్రాంగం ఆధారంగానే. ఏసీ గాలి వల్ల ప్రమాదం ఏమీ లేదు. ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. ఎటొచ్చీ ఫ్రియాన్‌ వాయువుతోనే ఉంది తంటా అంతా. ఇది వాతావరణంలోకి ఏమాత్రం లీక్‌ అయినా ఓజోన్‌ పొరను దెబ్బతీస్తుంది. తద్వారా భూ వాతావరణానికి అనారోగ్యం కలుగుతుంది.

www.bhaskerdesh.in

భూమధ్యరేఖ వద్ద వేడి ఎక్కువ ... దీని కారణం ఏమిటి?

భూమధ్యరేఖ వద్ద వేడి ఎక్కువ ... దీని కారణం ఏమిటి?

భూమికి సూర్యుడి నుండి కాంతి, ఉష్ణశక్తులు లభిస్తాయి. భూమిపై ఉష్ణం అన్ని చోట్ల ఒకే విధంగా ఉండదు. కొన్ని చోట్ల ఎక్కువ వేడిగా ఉంటే కొన్ని చోట్ల తక్కువ వేడి ఉంటుంది. భూమి గోళాకారంలో ఉండి, ధ్రువాల వద్ద కొంత మేరకు బల్లపరుపుగా ఉంటుంది. సూర్యకిరణాలు భూమిపై వివిధ ప్రదేశాలలో వివిధ కోణాలలో పడుతూ ఉంటాయి. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిలువుగా పడితే, దానికి ఉత్తర దక్షిణ దిశల్లో భూమధ్య రేఖ వద్ద వేడి ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ వేడి తక్కువగా ఉంటుంది.

ఈ విషయం సరిగ్గా అర్థం కావడానికి చిన్న ప్రయోగం చేయవచ్చు. ఒక పెద్ద గ్లోబు తీసుకొని దాని మధ్య మధ్య భాగంలో టార్చిలైటు వేశామనుకోండి దాని నుంచి వచ్చిన కాంతి గుండ్రంగా కేంద్రీకృతమవుతుంది. అదే టార్చిని కొద్దిగా వంచి గ్లోబుపై వేశామనుకోండి అది పల్చగా ఎక్కువ భాగం విస్తరిస్తుంది. అందుకే ఆ భాగాల్లో వేడి తక్కువగా ఉంటుందన్నమాట. కిరణాలు ఏటవాలుగా పడితే వేడి తక్కువగా ఎందుకుంటుందో చూద్దాం. భూమి పై ఏటవాలుగా పడే సూర్యకిరణాలు వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వుంటుంది. వాతావరణంలోని గాలి, దుమ్ము కణాలు, నీటి ఆవిరి తదితర పదార్థాలు కిరణాలలోని అధిక భాగం వేడిని గ్రహించడం జరుగుతుంది. అందువల్ల ఆ సూర్యకిరణాలు, ఆయా ప్రాంతాల్లో ఎక్కువ వేడిని కలిగించవు. అదే భూమధ్య రేఖ ప్రాంతాల్లో సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి కాబట్టి వాతావరణంలో తక్కువ దూరం ప్రయాణిస్తాయి. అందువల్ల అవి కోల్పోయే ఉష్ణం కూడా తక్కువగా ఉంటుంది. అందుకనే ఆ సూర్యకిరణాలు భూమధ్య రేఖ ప్రాంతాల్లో ఎక్కువ వేడిని కలిగించగలుగుతాయి.

కేవలం సూర్యకిరణాలే కాకుండా ఆయా ప్రాంతాల్లో నీటి విస్తరణ, సముద్ర మట్టం నుంచి ఆ ప్రదేశం ఎంత ఎత్తులో ఉంది, సముద్ర తీరానికే ఎంత దూరంలో ఉందనే అంశాలపైన కూడా ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది.
 

www.bhaskerdesh.in

కొన్ని పానీయాలు ఉత్సాహాన్ని ఇస్తాయంటారు నిజమేనా?


ప్రశ్న: కొన్ని పానీయాలు ఉత్సాహాన్ని ఇస్తాయంటారు నిజమేనా?
-
జవాబు: పానీయాల్లో చాలావరకూ స్వల్ప మోతాదులో ఉత్తేజాన్ని కలిగించే క్షారాలు (alkaloids) ఉంటాయి. ఉదాహరణకు కాఫీలోని కెఫైన్‌, టీ లోని థియోఫిలైన్‌, కోక్‌లోని కొకైన్‌. ఆరోగ్యం సరిగా లేని వ్యక్తికి మందులు ఎలా పనిచేస్తాయో, ఈ క్షారాలు కూడా దేహంపై అలాగే పనిచేస్తాయి. ఈ రకం పానీయాలు కండరాలను, ముఖ్యంగా శ్వాసనాళాలకు సంబంధించిన కండరాలను సడలించి సేదతీర్చడమే కాకుండా, కేంద్ర నాడీ వ్యవస్థను, గుండె కండరాలను ఉత్తేజపరుస్తాయి. మూత్రపిండాలను ఎక్కువ పని చేయించడమే కాక, మానసిక చైతన్యాన్ని ప్రేరేపిస్తాయి. కంటి చూపు, వినికిడి శక్తి పెరిగినట్లు అనిపిస్తుంది. సహనశక్తి ఎక్కువవుతుంది. అలసట తగ్గుతుంది. ఏదో కొత్త ధైర్యం, సామర్థ్యం వచ్చిన భావన కలుగుతుంది. కొందరిలో ఉల్లాసం కలుగుతుంది. అయితే ఈ నూతనోత్సాహం తాత్కాలికమే. ఎక్కువ సేపు నిలవదు. ఉత్సాహాన్ని ఇస్తున్నాయని ఎక్కువ సార్లు తాగితే భ్రమలకు లోనై స్థబ్దత కలుగుతుంది కూడా.

www.bhaskerdesh.in