Saturday 11 June 2016

ప్రశ్న: ఏ వస్తువైనా మండుతూ కొంతసేపు మాత్రమే ఉంటుంది. కానీ భూగర్భంలో విపరీతమైన ఉష్ణం తగ్గకుండా అలాగే ఉండడానికి కారణం ఏమిటి?


ప్రశ్న: ఏ వస్తువైనా మండుతూ కొంతసేపు మాత్రమే ఉంటుంది. కానీ భూగర్భంలో విపరీతమైన ఉష్ణం తగ్గకుండా అలాగే ఉండడానికి కారణం ఏమిటి?

జవాబు: ఉష్ణశక్తి ఎక్కువ ఉష్ణోగ్రత నుంచి తక్కువ ఉష్ణోగ్రత వైపు పయనిస్తుందని చదువుకుని ఉంటారు. వేడిగా ఉన్న వస్తువు కాసేపటికి చల్లబడడానికి కారణం, దానిలోని ఉష్ణోగ్రత పరిసరాలకు సరఫరా అవడమే. కొయ్యో, పెట్రోలు లాంటి ఇంధన పదార్థాలో మండుతున్నప్పుడు క్రమేణా మంట ఆరిపోవడానికి కారణం ఆయా ఇంధనాలు తరిగిపోవడమే.
ఇక భూమిలోని అత్యధిక ఉష్ణానికి అనేక అంశాలు దోహదపడుతున్నాయి. భూమి ఏర్పడిన తొలినాళ్లలో అంతరిక్షం నుంచి గ్రహశకలాలు వచ్చి ఢీకొనడం ఒక కారణం. భూగర్భంలో యురేనియం, థోరియంలాంటి రేడియోధార్మిక పదార్థాలు విచ్ఛేదనం (radioactive decay) చెందడం వల్ల భూగర్భంలో 80 శాతం ఉష్ణోగ్రత ఏర్పడుతోంది. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల జనించే బలాలు (tidal-forces) మరో కారణం. భూమికి ఉన్న విద్యుదయస్కాంత క్షేత్ర ప్రభావం వల్ల కొంత, ఇనుము, నికెల్‌, రాగిలాంటి ఖనిజాలు నిరంతరం భూమి అంతర్భాగం చేరుకునే క్రమంలో మరికొంత ఉష్ణోగ్రత ఉత్పన్నమవుతుంది. ఇలాంటి కారణాల వల్ల భూమి అంతరాంతరాల్లో ఉష్ణోగ్రత 7000 డిగ్రీల కెల్విన్‌ వరకు చేరుకుంది. ముఖ్యంగా రేడియో ధార్మిక పదార్థాల విచ్ఛిన్నం వల్ల ఏర్పడే అధిక ఉష్ణోగ్రత భూమి ఉపరితలానికి చేరుకునే అవకాశం లేకపోవడంతో భూగర్భంలో వేడి చల్లారకుండా అలాగే ఉంటుంది.

www.bhaskerdesh.in

మనం నడుస్తున్నపుడు చేతులు ఎందుకు వూపుతాము?


మనం నడుస్తున్నపుడు చేతులు ఎందుకు వూపుతాము?

జవాబు:
నడుస్తున్నప్పుడు చేతులూపడమనేది అసంకల్పితంగా జరిగేదే అయినా, దీని వెనుక బ్యాలన్స్‌కి సంబంధించిన సూత్రం ఉంది. ఇది, శరీరం మధ్య భాగాన్ని కదలకుండా ఉంచడానికి, దేహశక్తిని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. నడిచేప్పుడు మనపై కొన్ని బలాలు పనిచేస్తుంటాయి. మన శరీరం పైనుంచి కిందికి ఒక నిలువైన అక్షం (axis)ఉన్నట్టు వూహించుకుంటే, కుడికాలును ముందుకు వేసినప్పుడు అక్షంపై ఒక బలం గుండ్రంగా తిరుగుతూ పని చేస్తుంది. దీనిని అపవర్తన భ్రామకం (రొటేషనల్‌ మొమెంట్‌) అంటారు. దీని వల్ల నడుం గుండ్రంగా తిరగడానికి ప్రయత్నిస్తుంది. అలా తిరిగితే నియంత్రణ కోల్పోయి పడిపోతాం. ఈ బల ప్రభావాన్ని ఆపాలంటే దీనికి వ్యతిరేక దిశలో మరో బల భ్రామకం పనిచేయాలి. ఇది ఎడమ చేతిని ముందుకు వూపడం వల్ల ఏర్పడుతుంది. అంటే, కుడికాలును ముందుకు వేస్తే ఏర్పడిన బలాన్ని, ఎడమచేతిని ముందుకు ఊపితే ఏర్పడిన బలం 'బ్యాలెన్స్‌' చేస్తుంది.

కుడికాలును ముందుకు వేసినపుడు కుడిచేతిని, ఎడమకాలును ముందుకు వేసినపుడు ఎడమచేతిని అదే దిశలో వూపి నడవడం సాధ్యంకాదు. అలా చేస్తే మన నడుము, శరీరం పక్కకు ఒరిగిపోయే బలానికి గురవడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. ఇలా పరుగెత్తడానికి ప్రయత్నిస్తే అసలు సాధ్యం కాదు.

www.bhaskerdesh.in