Monday 3 October 2016

Aluminium (13)

అల్యూమినియమ్ (ఆంగ్లం: Aluminium, అమెరికాలో: అల్లూమినం) గ్రూపుIIIA మూలకము మరియు వెండిలా మెరిసే తేలికైన లోహము. దీని సంకేతం Al; పరమాణు సంఖ్య 13. మొట్టమొదటిసారిగా 1823లో వోలర్ అల్యూమినియమ్ క్లోరైడ్ ను పొటాషియమ్ తో వేడిచేసి అల్యూమినియమ్ ను వేరుచేసాడు. భూతలంలో సమృద్ధిగా దొరికే మూలకాలలో ఆక్సిజన్, సిలికాన్ ల తరువాత మూడవ స్థానం మరియు లోహాలన్నింటిలో మొదటి స్థానంలో ఉంటుంది. భూమి పొరలలో 7.28 శాతం అల్యూమినియమ్ ఉంటుంది. ప్రకృతిలో అల్యూమినియమ్ స్వేచ్ఛా స్థితిలో దొరకదు. ఇది సంయోగస్థితిలో ఇంచుమించు 270 వివిధరకాల లోహాలతో కలిసి ఎక్కువగా లభిస్తుంది. వీటిలో అన్నింటికన్నా ముఖ్యమైనది బాక్సైట్ ఖనిజం. దీని మిశ్రమాలు విమానాలు, కట్టడాలు తయారీలో విరివిగా ఉపయోగిస్తారు.

భౌతిక ధర్మాలు

1) అల్యూమినియమ్ వెండిలాగా మెరిసే తెల్లని లోహం.
2) ఇది మంచి ఉష్ణ, విద్యుద్వాహకం.
3) ఇది మెత్తని, సాగే, పటుత్వమున్న లోహం. దీని గట్టితనాన్ని ఇనుము, రాగిలతో పోల్చవచ్చు.
ఇది అనేక మిశ్రమ లోహాలను ఇస్తుంది.         4)  పాదరసంలో కరిగి ఎమాల్గమ్ ఇస్తుంది.
5) దీనితో తేలికగా వెల్డింగ్ చేయవచ్చు, పోత పోయవచ్చు. కాని టంకం చేయడం కష్టం.

అల్యూమినియమ్ ఉపయోగాలు

1) విద్యుత్ రవాణాకోసం తంతులని తయారు చేయడానికి వాడుతారు.
2) లోహ సంగ్రహణంలో డీఆక్సిడైజర్ గా అల్యూమినియమ్ ను బ్లో హోల్స్ ని తీసివేయడానికి వాడుతారు.
3) మిశ్రమ లోహాలు తయారు చేయడంలో వాడుతారు. ఇవి విమాన భాగాలు, ఆటోమొబైల్, భారీ వాహనాలు, స్పీడ్ బోట్ లు, సైకిల్ భాగాలు తయారుచేయటంలో ఉపయోగపడతాయి.
4) ఇనుము పరికరాల ఉపరితలాలకు పెయింట్ చేయడానికి టిన్, జింక్ బదులు అల్యూమినియమ్ వాడుతారు.
5) థెర్మైట్ వెల్డింగ్ లో అల్యూమినియమ్ పొడిని వాడుతారు.
6) సిగరెట్ లు, తినుబండారాలను చుట్టి ఉంచడానికి, చల్లని పానీయాల ప్యాకింగ్ చేయడంలో అల్యూమినియమ్ రేకు (foil) , రేకుడబ్బా (cans) ను వాడుతారు.
7) నీరు శుద్ధి చేయడంలో వాడుతారు.
కిటికీలు, తలుపులు, కుర్చీలు, వంటసామానులు మొదలైన గృహోపకరణాలు తయారుచేయడంలో వాడుతారు.
8) పరిశుద్ధమైన అల్యూమినియమ్ ను ఎలక్ట్రానిక్ పరికరాలు, కాంపాక్ట్ డిస్క్ ల తయారీలో వాడుతారు.
9) నాటకాలలో వాడే కృత్రిమమైన కత్తులు, కఠారులు తయారీలో వాడతారు.

అల్యూమినియమ్ మిశ్రమాలు

1) అమ్మోనియమ్ ఆలమ్ ([Al (NH4) ] (SO4) 2) ను నీరు శుభ్రపరచడంలో, మురికినీరు బాగుచేయడంలో, కాగితం తయారీలో, తోలు పరిశ్రమలో మోర్డెంట్గా వాడుతారు. రంగుల పరిశ్రమలో వర్ణస్థిరీకరణిగా కూడా ఉపయోగిస్తారు.
2) అల్యూమినియమ్ బోరేట్ (Al2O3 B2O3) గాజు మరియు పింగాణీ తయారుచేయడంలో వాడుతారు.
3) అల్యూమినియమ్ క్లోరోహైడ్రైడ్ కొన్ని వ్యాధులలో చెమటను తగ్గించడానికి వాడతారు.
4) అల్యూమినియమ్ హైడ్రాక్సైడ్ (Al (OH) 3) ను కడుపునొప్పిని కలుగజేసే జఠర రసం ప్రభావం తగ్గించడానికి వైద్యంలో వాడతారు.
5) అల్యూమినియమ్ ఆక్సైడ్ (Al2O3) కొన్ని ప్రకృతిలో లభించే రత్నాలలో భాగంగా ఉన్నది. ఉదా: నీలమణి, కెంపు.
6) అల్యూమినియమ్ లవణాలు టీకాలు తయారీలో రోగనిరోధక శక్తని పెంపొందించడానికి వాడతారు.