Friday 14 October 2016

ద్రాక్ష, దానిమ్మ లాంటి కొన్ని పండ్లను గింజలు లేని విధంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇదెలా సాధ్యం?

*ప్రశ్న: ద్రాక్ష, దానిమ్మ లాంటి కొన్ని పండ్లను గింజలు లేని విధంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఇదెలా సాధ్యం?*

జవాబు: ఏ పండుకైనా గింజకానీ, విత్తనం కానీ ఉంటుంది. ఇది ప్రకృతి ధర్మం. కానీ శాస్త్ర పరిశోధనలు పురోగమించే కొలదీ గింజలు లేని ద్రాక్ష, దానిమ్మ లాంటి పండ్లు మనకు లభిస్తున్నాయి. మామూలుగా విత్తనాలను నేలలో పాతడం ద్వారా మనకు మొక్కలు ఎదుగుతాయి. కానీ కొత్త పద్ధతుల్లో తీగలు లేక చెట్ల కొమ్మలనే నేలలో పాతడం ద్వారా మొక్కలను పెంచుతున్నారు. ఈ ప్రక్రియను 'క్లోనింగ్‌' అంటారు. ప్రకృతి సహజమైన సంపర్కంతో పని లేకుండానే అదే రకమైన జన్యుధర్మాలు ఉండే ప్రాణుల సృష్టినే క్లోనింగ్‌ అంటారు. ఈ ప్రక్రియలో ఎదిగిన చెట్లు, తీగల వల్లనే మనకు గింజలు లేని ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్‌, చెర్రీలాంటి పండ్లు లభిస్తాయి.

ప్రకృతి సిద్ధమైన తీగ లేక చెట్ల నుంచి ఒక చిన్న తీగనో, కొమ్మనో తుంచి దానిని ఆ చెట్ల వేర్లను ఉత్పత్తి చేసే హార్మోన్లలో ముంచి తడి మట్టిలో ఉంచి పెంచుతారు. కొంతకాలం తర్వాత ఆ కొమ్మకు భూమిలో వేర్లు, భూమిపైన ఆకులు పెరుగుతాయి. ఈ విధంగా పెరిగిన మొక్కల ఫలాలే 'సీడ్‌లెస్‌' (గింజలు లేని) పండ్లన్నమాట.

నిజానికి ఈ విధానంలో ఉత్పత్తి అయ్యే పండ్లలో కూడా ఒక దశలో గింజలు ఏర్పడుతాయి. కానీ క్లోనింగ్‌ వల్ల కలిగే జన్యుపరమైన తేడా వల్ల ఆ గింజల చుట్టూ గట్టిగా ఉండే కవచం ఏర్పడక పోవడంతో అవి అసలు గింజలలాగా గట్టిగా ఉండకుండా పండులోని గుజ్జుతో కలిసిపోతాయి.

www.bhaskerdesh.in