Tuesday, 24 May 2016

తల వెంట్రుకలు ఎలా రూపొందుతాయి?

ప్రశ్న:
తల వెంట్రుకలు ఎలా రూపొందుతాయి?

జవాబు:
పరిణామ క్రమంలో జంతువులు ఏర్పడ్డాక అవి పరిసరాలలోని ఉష్ణం, శీతలం, తేమ, సూక్ష్మజీవుల తాకిడి లాంటి పరిస్థితుల నుంచి రక్షణ పొందడానికి చర్మం మీద బొచ్చు ఏర్పడ్డం ప్రారంభమైంది. చర్మంలో ప్రధానంగా బయటి పొర (exodermis), లోపలి పొర (endodermis) అనే రెండు పొరలుంటాయని చదువుకుని ఉంటారు. చర్మం లోపలి పొర పలుచని కండరాలతో కూడి ఉంటుంది. ఇందులో పాదుల్లాంటి గుళికలు ఉంటాయి. వీటినే రోమస్థావరాలు (hair follicles) అంటారు. ఎలాగైతే వరి, జొన్నలాంటి మొక్కలు నేలపాదుల్లో గట్టిగా వేళ్లూనికుని పైకి ఎదుగుతాయో అలాగే ఈ కేశ స్థావరాల్లోంచి వెంట్రుకలు మొలిచి చర్మం బయటి పొర దాటి పైకి వస్తాయి. వెంట్రుకల్లో ఉండేది ఓ విధమైన ప్రొటీన్లు. వీటిని రసాయనికంగా ఆల్ఫా కెరోటీన్లు అంటారు. గంధకం కూడా ఓ అంశంగాగల సిస్టీన్‌ అనే ఆమైనో ఆమ్లం ప్రధానంగా ఉండే ప్రొటీన్లు ఇవి. ఈ ప్రొటీన్లతో పాటు మెలనిన్‌ అనే వర్ణ రేణువులు (pigments) విస్తారంగా ఉంటే ఆ వెంట్రుకలు నల్లగా ఉంటాయి. అవి లేనివి తెల్లగా ఉంటాయి.

www.bhaskerdesh.in

తల వెంట్రుకలు కొందరికి వంకర లేకుండా తిన్నగా ఉంటే, కొందరికి ఉంగరాలు తిరిగి ఉంటాయెందుకు?


ప్రశ్న: తల వెంట్రుకలు కొందరికి వంకర లేకుండా తిన్నగా ఉంటే, కొందరికి ఉంగరాలు తిరిగి ఉంటాయెందుకు?

జవాబు: తల వెంట్రుకల రంగులాగే వాటి ఆకారం కూడా జన్యు సంబంధమైన విషయమే. తూర్పు ఆసియా ప్రాంతం వారి తలవెంట్రుకలు సాధారణంగా వంకర లేకుండా తిన్నగా ఉంటే, యూరోపియన్లవి తిన్నగానైనా, ఉంగరాలుగానైనా ఉంటాయి. ఆఫ్రికా దేశవాసుల జుట్లు ఉంగరాలు తిరిగి బిరుసుగా ఉంటుంది. తిన్నగా ఉండే వెంట్రుకల అడ్డుకోత గుండ్రంగా ఉంటే, ఉంగరాల జుట్టు అడ్డకోత అండాకార రూపంలో ఉంటుంది. వివిధ రకాల వెంట్రుకలను వాటిలో ఉండే రసాయనిక సమ్మేళనాలను బట్టి గుర్తించవచ్చు. ప్రతి వెంట్రుకలో ప్రొటీన్‌ కెరొటిన్‌ అణువులు ముఖ్యంగా ఉంటాయి. తిన్నగా ఉండే వెంట్రుకల్లో ఇవి సల్ఫర్‌ బాండ్లలో గంధక బంధనాల (సల్ఫర్‌ బాండ్ల) ద్వారా ఒకటిగా బంధింపబడి ఉండడంతో అవి సాపుగా, దృఢంగా ఎదుగుతాయి. వీటికి తోడు అదనంగా వదులుగా బంధింపబడి స్థితిస్థాపకత కలిగిన కెరొటిన్‌ కలిగి ఉండే వెంట్రుకలు వంకర తిరిగి ఉంగరాల జుట్లుగా ఏర్పడతాయి. తిన్నగా ఉండే వెంట్రుకలలోని సల్ఫర్‌బాండ్లను విచ్ఛిన్నం చేయడం ద్వారా వాటిని ఉంగరాల జుట్టుగా మార్చవచ్చు. ఈ ప్రక్రియను పెర్మింగ్‌ అంటారు.

వృద్ధాప్యంలో తల వెంట్రుకలు తెల్లబడతాయెందుకు?.

ప్రశ్న: వృద్ధాప్యంలో తల వెంట్రుకలు తెల్లబడతాయెందుకు?.

జవాబు: వెంట్రుకలు దేహంపై ఉండేే చర్మంలో ఒక భాగం. చర్మం ఛాయ శరీరంలో ఉండే ఐదు పిగ్మెంట్ల (రంగుతో కూడిన పదార్థాలు)పై ఆధారపడి ఉంటుంది. ఈ పిగ్మెంట్లలో 'మెలానిన్‌' ముఖ్యమైనది. ఇది దేహంలో ఉండే మెలనోసైటిస్‌ అనే కణాల నుండి ఉత్పన్నమవుతుంది. ఈ మెలానిన్‌ చర్మం కింది భాగంలో, వెంట్రుకలలో, కళ్ళలో ఉంటుంది. మెలానిన్‌ తక్కువ పాళ్లలో ఉంటే శరీరం తెల్లగాను, ఎక్కువగా ఉంటే నల్లగాను ఉంటారు. కళ్లు, వెంట్రుకల రంగు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది.

వయసు పెరిగే కొద్దీ ముఖ్యంగా వృద్ధాప్యంలో శరీర ప్రక్రియలన్నీ నెమ్మదిస్తాయి. మెలనోసైటిస్‌ కణాలు తక్కువ శాతంలో మెలానిన్‌ను ఉత్పన్నం చేస్తాయి. అందువల్ల వృద్ధులకు తల నెరుస్తుంది. నిజానికి ప్రతి వెంట్రుక పారదర్శకంగా ఉండే ఒక సన్నని గొట్టం లాంటిది. ఆ గొట్టం నిండా మెలానిన్‌ ఉన్నంత కాలం ఆ వెంట్రుక నల్లగా ఉంటుంది. దానికి తగినంత మెలానిన్‌ అందకపోతే వెంట్రుక నల్లని రంగు క్రమేపీ మారి గొట్టం మొత్తం ఖాళీ అయిపోగానే తెల్లగా కనిపిస్తుంది. బాల్‌పాయింట్‌ పెన్‌ రీఫిల్‌ నిండా ఇంకు ఉన్నప్పుడు నల్లగాను, ఇంకు పూర్తిగా అయిపోయిన తర్వాత తెల్లగాను కనబడినట్టే ఇది కూడానన్నమాట. ఒకోసారి మెలనోసైటిస్‌ కణాలు మెలానిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోవడంతో యుక్తవయసులోనే కొందరి తల వెంట్రుకలు తెల్లబడతాయి. దీన్నే బాలనెరుపు అంటారు.

గిటార్ ముందు భాగములో ఒక రంద్రం ఉంటుంది ,.. దాని అవసరము ఏమిటి?

గిటార్ ముందు భాగములో ఒక రంద్రం ఉంటుంది ,.. దాని అవసరము ఏమిటి?

గిటార్ లో తంత్రులు (Strings) ఒక పొడవైన బద్దలాంటి భాగము, దానికి అనుసంధానము గా బోలుగా ఉండే పట్టేలాంటి భాగాలపై బిగించి ఉంటాయని మనకు తెలుసు . గిటారును వాయించడం అంటే బిగించి తన్యతతో (Tensoin) తో కూడిన లోహపు తీగెలను మీటడమే ... అలా మీటినపుడు ఏర్పడిన ధ్వని తరంగాలు గిటారు నుంచి బయటకు వస్తేనే ఆ శబ్దాన్ని శ్రోతలు వినగాలుగుతారు . aలా శబ్ద తరంగాలు బయటకు రావడానికే పెట్టేలాంటి భాగము లో రంద్రాన్ని ఏర్పరుస్తారు . పెట్టె బోలుగా ఉండడము వల్ల దాని లో ఉండే గాలి తీగల్లో ఉత్పన్నమయ్యే శబ్దతరంగాల కంపనాలతో పాటు బలాత్క్రుత తరంగ కంపనాలను (ForcedVibrations) ఉత్పన్నము చేస్తాయి. ఇందువల్ల గిటార్ నుంచి వలువదే ధ్వని గంభీరము గా , శ్రావ్యము గా ఉంటుంది .

అందుకనే వీణ , వయోలిన్ , గిటార్, తంబురా .. లాంటి వాయిద్యాలలో కుడా తీగలను బోలుగా రంద్రాలన్దే పెట్టెల(SoundBoxes) పై బిగిస్తారు.

www.bhaskerdesh.in

తెల్ల వెంట్రుకల్ని తీసేస్తే మరింత ఎక్కువగా వస్తాయంటారు. నిజమేనా?

ప్రశ్న: తెల్ల వెంట్రుకల్ని తీసేస్తే మరింత ఎక్కువగా వస్తాయంటారు. నిజమేనా?

జవాబు: ఈ అభిప్రాయంలో నిజం లేదనే చెప్పుకోవాలి. తెల్ల వెంట్రుకలకు, నల్ల వెంట్రుకలకు ఉన్న తేడా కేవలం వాటిలో ఉన్న మెలనిన్‌ అనే వర్ణరేణువుల శాతంలో తేడానే. తెల్ల వెంట్రుకలలో మెలనిన్‌ రేణువులు దాదాపు ఉండవనే చెప్పవచ్చు. గోధుమ రంగు వెంట్రుకల్లో ఇవి ఓ మోస్తరుగా ఉంటాయి. వెంట్రుకలు మన చర్మం కింద ఉండే రోమ కుదుళ్ల నుంచి మొలుస్తాయి. ఈ కుదుళ్లు ఉపరితల చర్మం (epidermis) కింద ఉన్న అంతశ్చర్మం (dermis)లో ఉంటాయి. అక్కడే మెలనిన్‌ రేణువులు ఉత్పత్తి అవుతూ వెంట్రుక అనే ప్రొటీన్‌ గొట్టంలో దట్టంగా పేరుకుంటూ వస్తాయి. తెల్లని వెంట్రుకలు వచ్చే కుదుళ్ల దగ్గర మెలనిన్‌ రేణువుల ఉత్పత్తి లేకపోవడం కానీ లేదా వృద్ధాప్యం వల్ల మందగించడం కానీ జరుగుతుంది. ఆ తెల్ల వెంట్రుకల్ని పదే పదే తీసేసినప్పుడు అవి మాత్రమే పెరిగేలా ఆ కుదుళ్లు ఉత్తేజం పొంది, తెల్ల వెంట్రుకల ఉత్పత్తి జోరుగా సాగవచ్చునన్నది ఓ సమాధానం. కానీ దీనికి ఉన్న సంభావ్యత తక్కువ.

www.bhaskerdesh.in

భూగర్భ జలాలు అంటే ఏమిటి?


ప్రశ్న: భూగర్భ జలాలు అంటే ఏమిటి?

జవాబు: సముద్రపు తీరానో లేక ఒక సరస్సు పక్కన ఉన్న ఇసుకను చేతితో తోడుతూ పోతే కొంతలోతులో నీరు లభిస్తుంది. ఆ నీరే భూగర్భ జలం. నేలపై బావి తవ్వితే అందులో ఊరే నీరు భూగర్భ జలం. భూమిపై కురిసిన వర్షపునీరు, మంచు, వడగళ్లవాన వల్ల ఏర్పడిన నీరు గురత్వాకర్షణ వల్ల నేలపై ఉండే మన్ను, ఇసుక, గులకరాళ్ల పొరలగుండా భూమిలోకి ప్రవేశించి అక్కడ ఉండే రాతి పొరల్లో పయనించి కొంత లోతులో నిక్షిప్తమవుతుంది. సరస్సులలో నదుల్లో, సముద్రాల్లో లభించే నీరు ఉపరితలపు నీరు (surface water). ఉపరితలపు నీరు, భూగర్భ జలాలు వాటి స్థలాలను మార్చుకుంటాయి. భూగర్భ జలాలు భూమిలోని పొరల గుండా సరస్సుల్లోకి, కాలువల్లోకి ప్రవేశింవచ్చు. అలాగే సరస్సుల్లోని నీరు పక్కనే ఉన్న భూభాగంలోకి 'లీకై' భూగర్భ జలంగా మారవచ్చు.

భూగర్భ జలాలను తనలో ఇముడ్చుకొనే ప్రక్రియలో భూమి ఒక పెద్ద స్పాంజిలాంటి పాత్రను పోషిస్తుంది. భూగర్భ జలాన్ని బావులు తవ్వడం ద్వారా, బోరు పంపులు వెయ్యడం ద్వారా భూమిపైకి తీసుకొని వచ్చి, ఆ నీటిని తాగునీటిగా, సేద్యపు నీరుగా వాడుకుంటాం. ఆ విధంగా భూగర్భజలం మానవులకు ప్రకృతి ప్రసాదించిన ఒక బ్యాంక్‌ ఎకౌంట్‌ లాంటిది.

భూగర్భజలాలు చాలావరకు స్వచ్ఛంగానే ఉంటాయి. ఎటొచ్చి భూమి లోపల నిర్మించిన ఆయిల్‌ టాంకర్లు లీక్‌ అయితేనే, పంటపొలాలకు అవసరానికి మించి రసాయనిక ఎరువులు వేయడం వల్లో ఆ కాలుష్యాలు భూగర్భ జలాలను కలుషితం చేసే ప్రమాదం ఉంది.

www.bhaskerdesh.in

Monday, 23 May 2016

చిన్న వయసులోనూ కొంతమందికి తెల్ల జుత్తు వస్తుంది ఎందువల్ల?


 ప్రశ్న:చిన్న వయసులోనూ కొంతమందికి తెల్ల జుత్తు వస్తుంది ఎందువల్ల?

జవాబు: మన తలపై ఉండే వెంట్రుకలు ఏక కాలంలో రెండు రకాలుగా ఉపయోగపడతాయి. పరిసరాల్లో ఉన్న ఉష్ణాన్ని బాగా గ్రహించి శరీరంలోకి చేరకుండా చేసే మంచి ఉష్ణ గ్రాహణి (heat absorber)గాను, శరీరంలో విడుదలయిన వేడి త్వరితంగా వాతావరణంలోకి పంపగల మంచి ఉష్ణ ఉద్గారిణి (heat emitter) గాను అవి పనిచేస్తాయి. మరి ఆ వెంట్రుకలకు నల్లని రంగు ఎలా వచ్చింది? చర్మం పైపొర కిందున్న డెర్మిస్‌ అనే పొరలో కేశ గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు తెల్లగా నైలాన్‌ దారంలా ఉండే ప్రోటీను తీగల్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ ప్రోటీను తీగల తయారీ సమయంలోనే కేశ గ్రంథులకు దగ్గరే ఉన్న కణాల్లోని మెలనిన్‌ అనే నల్లని వర్ణ రేణువులు ఆ ప్రోటీను అణువుతో లంకె వేసుకుంటూ వెంట్రుకతో పాటు బయట పడతాయి. అందువల్లనే తెల్లగా ఉండవలసిన వెంట్రుక ప్రోటీను తీగ నల్లగా కనిపిస్తుంది.

ఈ మెలనిన్‌ రేణువులకు సాధారణ కాంతినే కాకుండా అరుదుగానైనా సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల్ని కూడా శోషించుకునే లక్షణం ఉంది. వెంట్రుకల ఉత్పత్తి ఆగకున్నా మెలనిన్‌ రేణువులు సరిగా ఉత్పత్తి కాకుంటే వయసు చిన్నదయినా తెల్లని వెంట్రుకలే తలపై ఉంటాయి. వృద్ధాప్యంలో ఈ మెలనిన్‌ రేణువుల ఉత్పత్తి తక్కువ అవుతుంది కాబట్టి ముసలి వారి వెంట్రుకలు తెల్లబడతాయి. సౌర కాంతి అధికంగా లేని పశ్చిమోత్తర (northwest) ప్రజల వెంట్రుకలు కూడా తెల్లగా ఉంటాయి.

www.bhaskerdesh.in