Monday, 23 May 2016

రాత్రి వేళల్లో వికసించే మల్లెపూలకు, నైట్‌క్వీన్‌కు అంత సువాసన ఎందుకు?

ప్రశ్న: రాత్రి వేళల్లో వికసించే మల్లెపూలకు, నైట్‌క్వీన్‌కు అంత సువాసన ఎందుకు?

జవాబు: కొన్ని పూలకు ఆకర్షణీయమైన రంగులు ఉంటే మల్లె, నైట్‌క్వీన్‌(రాత్‌కీ రాణి) లాంటి పూలకు మధురమైన సువాసన ఉంటుంది. కొన్ని పూలకు రంగు, సువాసనా రెండూ ఉంటాయి. వీటి వెనుక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. క్రిమికీటకాలు, తేనెటీగలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకలు పూలలోని మకరందాన్ని పీల్చుకుని జీవిస్తాయి. ఇవి పూలపై వాలినపుడు వాటి కాళ్లకు, రెక్కలకు పూలలోని పుప్పొడి అంటుకుంటుంది.

ఈ కీటకాలు మరో పువ్వుపై వాలినపుడు పుప్పొడి రేణువులు ఆ పూవు అండాశయాన్ని చేరి ఫలదీకరణం జరుగుతుంది. అపుడే పువ్వు కాయగా మారుతుంది. అవే పండ్లుగా మారి వాటి గింజలు భూమిపై పడి మొలకెత్తి మొక్కలు పెరుగుతాయి. ఈ విధంగా మొక్కలు ఉత్పత్తి కావడానికి ఉపయోగపడే కీటకాలను ఆకర్షించేందుకే పూలకు అందమైన రంగులు, రకరకాల సువాసనలు ఏర్పడతాయి.

కీటకాల్లో కొన్ని పగలు సంచరిస్తే మరికొన్ని రాత్రివేళల్లో తిరుగుతుంటాయి. పగటి వేళ వీటిని ఆకర్షించడానికి వాటి రంగులు దోహదపడతాయి. రాత్రివేళ రంగులు కనబడవు కాబట్టి రాత్రి పూచేపూలు మరింత ఎక్కువగా సువాసనను వెదజల్లుతాయి.

సాయం వేళల్లో, రాత్రులలోని వాతావరణ పరిస్థితులకు మాత్రమే ప్రేరణ పొంది వికసించే జాజి, మల్లె, నైట్‌క్వీన్‌ లాంటి పూలకు మనోహరమైన సువాసన ఉండటానికి కారణం అదే. రాత్రిపూట రంగులతో పని ఉండదు కాబట్టి సాధారణంగా అలాంటి పూలు చీకటిలో కనిపించేందుకు వీలుగా తెల్లని రంగులో ఉంటాయి.

www.bhaskerdesh.in

జింకు, రాగి వంటి లోహాలు తుప్పు పడతాయి. కానీ బంగారం, ప్లాటినం వంటి లోహాలు పట్టవు. ఎందుకు?

ప్రశ్న: జింకు, రాగి వంటి లోహాలు తుప్పు పడతాయి. కానీ బంగారం, ప్లాటినం వంటి లోహాలు పట్టవు. ఎందుకు?

జవాబు: సూర్యుడి లాంటి నక్షత్రాల్లో కేవలం వాయువులే ఉన్నా భూమిలాంటి గ్రహాల్లో వాయువులతోపాటు ద్రవాలు, ఘనపదార్థాలు ఉన్నాయి. వీటి అంతర నిర్మాణాన్ని బట్టి మూలకాలు, లేదా సంయోగ పదార్థాలు అనే రెండు కోవలకు చెందుతాయి. మూలకాల్లో ఒకే రకమైన పరమాణువులు ఉంటాయి. ఉదాహరణకు అల్యూమినియం లోహంలో ఉన్నవన్నీ అల్యూమినియం పదార్థంతో కూడిన పరమాణువులే. కానీ సంయోగ పదార్థాలు, కొన్ని మూలకాలు కలవడం వల్ల ఏర్పడతాయి. వీటిలో వేర్వేరు రకాలైన పరమాణువులు బృందాలుగా ఉంటాయి. ఈ బృందాలను అణువులు అంటాం.

సాధారణంగా మూలకాల కన్నా సంయోగ పదార్థాలు స్థిరంగా ఉంటాయి. స్థిరంగా ఉండడమంటే రసాయనికంగా మార్పును నిరోధించడమే. ఉష్ణగతిక శాస్త్రం ప్రకారం పదార్థాలు మారడానికి కారణం వాటిలో ఉన్న అంతరంగిక శక్తి తగ్గడమే. ఇనుము, జింకు, రాగి, అల్యూమినియం, మెగ్నీషియం వంటి లోహాల మూలకాలకన్నా వాటి సంయోగ పదార్థాలైన లోహ ఆక్సైడ్‌లు తక్కువ శక్తితో ఉంటాయి. కాబట్టి ఆ లోహాలు తుప్పుపట్టడాన్ని ఆమోదిస్తాయి. కానీ బంగారం, ప్లాటినం, స్టెయిన్‌లెస్‌ స్టీలు వంటి లోహాల మూలకాలకన్నా వాటి సంయోగ పదార్థాలైన లోహ ఆక్సైడ్‌లు ఎక్కువ శక్తితో ఉంటాయి. కాబట్టి అవి తుప్పు పట్టవు.

www.bhaskerdesh.in

Friday, 20 May 2016

కాంతి (LightRay) - తరంగమ?కణమా ?


కాంతి (LightRay) - తరంగమ?కణమా ? అంటే చెప్పడము కష్టమే ! ఒక్కొక్క సారి ప్రశ్న కు ఎదురు ప్రశ్నే జవాబునిస్తుంది . ఉదాహరణకి నానేనికున్నది బొమ్మా లేదా బొరుసా? అంటే ఏం చెబుతాం ?. కాంతికి కుడా నాణేనికిలాగే కణ(Corpuscular) స్వభావము , తరంగ (Wave)స్వభావము సంయుక్తం గా అవిభాజ్యం గా ఉంటాయి . ఎలాగైతే నేల మీద పడేసిన నాణెపు రెండు పక్కలు (బొమ్మ , బొరుసు) ఒకే సారి ఎలా చూడ లేమో ... ఒకే ప్రయోగం ద్వారా కాంతికున్న తరంగ స్వభావాన్ని , కణ స్వభావాన్ని ఏకకాలం లో పరిశీలించాలేము .

కాంతి వక్రీభవనం(Refraction) , వివర్తనం (Disfraction) , వ్యతికరణం (Interference), ద్రువనం (Polarisation) అనే ధర్మాలను కలిగి ఉంటుంది . కాంతి కున్న తరంగ స్వభావానికి ఈ ద్రుగ్విషయాలు కారణము . కాంతి విద్యుత్ఫలితము (PhotoElectricEffect), కాంఫ్తాన్ ఫలితము , కాంతి రసాయనిక చర్యలు (PhotoChemical phinomena) , కృష్ణ వస్తు వికిరణం (BlackBodyRadiation) ఉద్గార వర్ణ పటాలు (EmissionSpectra) వంటి ప్రయోగ ఫలితాలు , పరిశీలనలు , కాంతి కున్న కనస్వభావాన్ని సూచిస్తాయి. ప్రయోగ పూర్వకం గా రెండు లక్షణాలు ఏక సమయం లో ఉండడం వల్ల కాంతికి కణ-తరంగ ద్వంద్వ స్వభావం (WaveParticleDuality) ఉందంటారు.
www.bhaskerdesh.in

విద్యుత్‌ పరికరాల వాడకంలో రెండు వైర్లు బదులు ఒకటే వినియోగించి విద్యుత్‌ ప్రసారం చేయలేరా?


ప్రశ్న: విద్యుత్‌ పరికరాల వాడకంలో రెండు వైర్లు బదులు ఒకటే వినియోగించి విద్యుత్‌ ప్రసారం చేయలేరా?
జవాబు: ఏదైనా విద్యుత్‌ పరికరం పని చేయాలంటే అందులో కీలకమైన విద్యుత్‌ వలయం (electrical circuit)లో విద్యుత్‌ ప్రవాహం జరగాలి. నదిలో నీరు ప్రవహించినట్టే ఆ విద్యుత్‌ వలయంలో ఎలక్ట్రాన్ల ప్రవాహం జరగాలి. నదికి నీరు వచ్చే దిశ, వెళ్లే దిశ ఉన్నట్టే విద్యుత్‌ పరికరానికి ఎలక్ట్రాన్లు చేరే చివర (terminal), ఎలక్ట్రాన్లు పోయే చివర అంటూ రెండు ధ్రువాలు ఉండాలి. విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఒక ధ్రువాన్ని భూమికి కలిపి రెండో ధ్రువాన్ని విద్యుద్వాహినిగా చేస్తారు. భూమికి కలిపిన చివరను న్యూట్రల్‌గాను, విద్యుత్‌ ప్రవహించే తీగను ఫేజ్‌ లేదా లైన్‌ అనే పేరుతోను వ్యవహరిస్తారు. అవే రెండు తీగలు. ప్రతి సారీ మనం ఇళ్లలో గొయ్యి తవ్వి భూమికి ఒక వైరును తగిలించలేము కాబట్టి ఇళ్లకు వచ్చే సరఫరాలోనే భూమిని కలిపే సదుపాయమే న్యూట్రల్‌. ఇక బ్యాటరీల విషయానికి వస్తే విధిగా రెండు తీగలను (ధన, రుణ ధ్రువాలు) ఉండాలి. ఇక్కడ ఒక తీగ పనిచేయదు. ఎందుకంటే బ్యాటరీలోనే విద్యుత్‌ ప్రవాహం ఆరంభమవుతుంది కాబట్టి తిరిగి ఎలక్ట్రాన్లు అక్కడికే చేరాలి. లేకపోతే వలయం తెగిపోతుంది.
www.bhaskerdesh.in

Monday, 16 May 2016

మనం రకరకాల ఆహారపదార్థాలు తీసుకుంటాము. ఎన్నో రుచికరమైన, సువాసన భరితమైన మసాలా దినుసులతో ఆహారాన్ని, పానీయాల్ని సేవిస్తాము. కానీ జీర్ణమయ్యాక మిగిలిన వ్యర్థాలు (మలమూత్రాలు) దుర్గంధంగా ఉండడానికి కారణమేమిటి? 


Q : మనం రకరకాల ఆహారపదార్థాలు తీసుకుంటాము. ఎన్నో రుచికరమైన, సువాసన భరితమైన మసాలా దినుసులతో ఆహారాన్ని, పానీయాల్ని సేవిస్తాము. కానీ జీర్ణమయ్యాక మిగిలిన వ్యర్థాలు (మలమూత్రాలు) దుర్గంధంగా ఉండడానికి కారణమేమిటి? 

A : తీసుకున్న ఆహారపదార్థాలలోని పిండిపదార్థాల్లోంచి గ్లూకోజు, ఫ్రక్టోజులు, మాంసకృత్తుల నుంచి వివిధ అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్థాల నుంచి కణత్వచాని (cell wall) కి ఉపయోగపడే లిపిడ్లు ఉత్పన్నమవుతాయి . అవి చిన్నప్రేవులో ఉండే విల్లై అనే కణపొర ద్వారా రక్తంలో కలుస్తాయి . ఇంతవరకు బాగానే ఉంది. అయితే నోటి నుంచి గుదము (anus) వరకు వ్యాపించిన దాదాపు 2, 3 మీటర్ల పొడవుండే జీర్ణకోశ వ్యవస్థలో పలుచోట్ల పలురకాలైన భౌతిక రసాయనిక స్థితులు ఉంటాయి. అనువైన చోట్ల మన పుట్టుక వెంటనే ఎన్నో బాక్టీరియాలు మన జీర్ణవ్యవస్థలో తమ స్థావరాల (colonies) ను ఏర్పరుచుకొంటాయి. ఇందులో అపాయకరమైన బాక్టీరియాలు, ఉపయోగపడే బాక్టీరియాలు రెండూ ఉంటాయి. మనకు నోటిలో పుండ్లు రావడం, విరేచనాలు రావడం, వాంతులు రావడం, అజీర్తి వంటి పలు అవాంఛనీయమైన లక్షణాలకు కారణం ప్రమాదకర బాక్టీరియాలు మన జీర్ణవ్యవస్థలో ఉండడమే. ఇచరేరియాకోలై (E.Coli), సాల్మొనెల్లా, జియార్డియా (giordia), క్రిప్టోస్పోరిడియం (cryptosporidum) వంటివి ప్రేగుల్లో ఉంటాయి. ఉపయోగపడే బాక్టీరియాను ప్రొబయోటిక్స్‌(probiotics) అంటారు. ఇందులో లాక్టోబాసిల్లస్‌ అసిడోఫిలస్‌ (Lactobacillus acidophilus), బైఫిడోబాక్టీరియా బైఫ్రిడమ్‌ (Bifidobacteria bifridum) వంటివి ఉదాహరణలు. 

మంచి బాక్టీరియా అయినా చెడు బాక్టీరియా అయినా అవీ బతకాలి. తమ సంతానాన్ని పుంఖాను పుంఖాలుగా పెంచుకోవాలి. కాబట్టి వాటికీ ఆహారం అవసరం. కొన్ని బాక్టీరియాలు వాటి సంఖ్య మించితే మనకు వాంతులు, విరేచనాలు, కలరా, డయేరియా లాంటి వ్యాధులతో తెలిసిపోయినా వాటి సంఖ్య అదుపులో ఉన్నంతవరకు వాటిని మన తెల్లరక్తకణాలు నాశనం చేస్తుంటాయి. కాబట్టి బాక్టీరియాలు మన కణాల్ని తింటూ వాటి విసర్జక పదార్థాల్ని జీర్ణమవుతున్న మన ఆహారపదార్థాల మిశ్రమంలోనే కలుపుతాయి. అందులో చాలా దుర్గంధభరితమైన గంధకం, ఫాస్ఫరస్‌, నత్రజని సమ్మేళనాలు ఉంటాయి. 

చాలాసార్లు మన ఆహారాన్నే అవీ భాగం పంచుకొని మనలాగా కాకుండా మరో విధమైన అవాయు ప్రక్రియ (anaerobic metabolism) ద్వారా ఆక్సిజన్‌ అవసరం లేకుండానే శక్తిని పొంది తమ జీవన కార్యకలాపాల్ని కొనసాగిస్తాయి. అవాయు ప్రక్రియల్లో ఎన్నో దుర్గంధభరితమైన పదార్థాలు విడుదలవుతాయి. ఉపయోగపడే బాక్టీరియాలు కూడా పెద్దప్రేవుల్లో ఉంటాయి. ఇవి మన జీర్ణవ్యవస్థలో జీర్ణం కాగా మిగిలిన వ్యర్థ పదార్థాల మీద ఆధారపడి బతుకుతుంటాయి.అవి ఒక్కోసారి దుర్గంధాన్ని తగ్గిస్తాయి. మరోసారి దుర్గంధాన్ని పెంచుతాయి. ఈ విధంగా మనం తీసుకున్న పంచభక్ష్య పరమాన్నాలు, సుగంధభరిత పానీయాలు, షడ్రుచుల ఆహారదినుసులు నోటి వరకే వాటి సౌభాగ్యం. ఆ తర్వాత అవి రకరకాల రసాయనిక ప్రక్రియల్లో, జీవ రసాయనిక ప్రక్రియల్లో, బాక్టీరియా కౌగిళ్లలో ... లోగిళ్లలో పడిపోయి వివిధ మార్పులకు లోనవుతాయి. చివరకు దుర్గంధ భరితమైన మలమూత్రాదుల రూపంలో బయటపడతాయి. ఇందులో ఉపయోగపడే బాక్టీరియాల వంతూ ఉంది కాబట్టి ఆ కంపే ఆరోగ్యానికి ఇంపు అనుకోకతప్పదు.
www.bhaskerdesh.in

ఎగిరే పాముల రహస్యమేమిటి ?


Flying Snakes Secreat what?, ఎగిరే పాముల రహస్యమేమిటి ?

పాములు పాకుతాయని తెలుసు... కానీ ఎగురుతాయా? అలాంటివి ఉన్నాయి! వాటిపై పరిశోధన జరిగింది... రహస్యమేంటో బయటపడింది!!

మీకు గ్త్లెడింగ్‌ అంటే తెలుసుగా? పెద్ద పెద్ద రెక్కల్లాంటి అమరిక ఉండే గ్త్లెడర్‌ని తీసుకుని ఏ కొండ మీదకో వెళ్లి దాంతో సహా దూకేసి చాలా దూరం ఎగురుతూ వెళ్లే సాహసక్రీడ అది. అచ్చం అలాగే గాలిలో ఎగిరే పాములు ఉన్నాయని మీకు తెలుసా? వాటినే ఫ్లయింగ్‌ స్నేక్స్‌ అంటారు. వీటిలో అయిదు జాతులు ఉన్నాయి. దక్షిణాసియా ప్రాంతాల్లోని అడవుల్లో కనిపించే ఇవి ఎలా ఎగరగలుగుతున్నాయనేది ఇంతవరకూ ఓ వింతే. తాజాగా కాలిఫోర్నియాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు పరిశోధన చేసి, వాటి రహస్యమేంటో కనిపెట్టారు.

గ్త్లెడింగ్‌ చేసే క్రీడాకారుల్లాగే ఎగిరే పాములు కూడా ఎత్తయిన ఏ చెట్టు మీదకో ఎక్కి, అక్కడి నుంచి చటుక్కున దూకేసి గాలిలో బ్యాలన్స్‌ చేసుకుంటూ కిందికి సురక్షితంగా చేరుకోగలవు. వేటాడ్డానికి, శత్రువు నుంచి తప్పించుకోడానికి ఇలా చేస్తాయి. ఇవి ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకేసి దాదాపు 100 మీటర్ల దూరాన్ని కూడా గాలిలో ప్రయాణించగలవు. ఇంత ఎత్తు నుంచి మామూలు పాముని పడేస్తే అది తలకిందులుగా కింద పడి ఎముకలు విరిగిపోవడం ఖాయం. మరైతే ఇది ఎలా ఎగరగలుగుతోంది? గాలిలోకి దూకగానే ఇవి తమ పక్కటెముకలు సాగదీసి గుండ్రని శరీరాన్ని సమతలంగా చేయగలుగుతాయని ఇంతకు ముందే తెలుసు. అయితే మరి కొన్ని పాములకు కూడా ఇలా శరీరాన్ని మార్చుకునే విద్య తెలుసు. అంటే ఎగిరే పాములు దీంతో పాటు మరో రకమైన విన్యాసం కూడా చేస్తున్నాయన్నమాట. మరి అదేంటి? అది తెలుసుకోడానికే శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు.

అయిదు పాముల్ని తీసుకుని వాటిపై తెల్లటి మెరిసే చుక్కల్ని అమర్చారు. ఆపై వాటిని ఎత్తయిన టవర్‌పై వదిలి అవి అక్కడి నుంచి దూకి కిందకి రావడాన్ని ఒకేసారి నాలుగు కోణాల్లో అత్యాధునిక త్రీడీ వీడియో కెమేరాలతో చిత్రీకరించారు. ఆ దృశ్యాలను కంప్యూటర్‌లోకి ఎక్కించి, మెరిసే చుక్కల్ని బట్టి యానిమేషన్‌ మోడల్‌ పాములను సృష్టించి వాటి శరీరం ఎలాటి కదలికలకు లోనైందో గమనించారు.

ఇంతకీ ఏం తెలుసుకున్నారు? ఈ పాములు ఎత్తు నుంచి దూకుతూనే గాలి వీచే దిశని అంచనా వేస్తూ శరీరాన్ని 25 డిగ్రీల కోణంలో తిప్పడం ద్వారా బ్యాలన్స్‌ చేసుకుంటున్నాయని గమనించారు. గాలిపటాలు, విమానాలు ఎగరడంలో కింద నుంచి పైకి వీచే గాలి శక్తి ప్రధాన పాత్ర వహిస్తుంది. దీన్నే 'లిఫ్ట్‌' అంటారు. ఈ పాములు కూడా ఆ శక్తిని ఉపయోగించుకుంటున్నాయని తేలింది. తలని, తోకను వ్యతిరేక దిశల్లో చకచకా కదిలిస్తూ గాలిలోనే ఈదుతున్నట్టుగా ఎగురుతూ మార్గాన్ని కూడా మార్చుకుంటున్నాయని తేల్చారు.

www.bhaskerdesh.in

విశ్వంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు, సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమ్మీద ఉన్న మనము, ఇతర జీవులు ఎందుకు తిరగరు?


ప్రశ్న: విశ్వంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు, సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమ్మీద ఉన్న మనము, ఇతర జీవులు ఎందుకు తిరగరు?

జవాబు: భూమి ఆత్మప్రదక్షిణం చేస్తూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతున్నమాట నిజమే. ఆ భూమితో పాటు ఇతర జీవులు మనం కూడా తిరుగుతూనే ఉన్నాయి. మనం ఏదైనా బస్సులాంటి వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు కదులుతున్న భావన మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ సమయాల్లో వాహనం మీద ప్రోద్బలమో (forwarding force), లేదా వ్యతిరేక బలమో (force of resistance), భూమ్యాకర్షణకు వ్యతిరేకంగానో, అనుకూలంగానో కొన్ని బలాలు పనిచేస్తూ ఉంటాయి. ఏ బలమూ పనిచేయని వాహనంలో సమవేగంతో మనం ప్రయాణిస్తుంటే మనకు ఎలాంటి కుదుపులు తెలియవు. భూమి మీద అపలంబ బలము, అపకేంద్ర బలము, సూర్యుడు గ్రహాల వల్ల కలిగే గురుత్వబలము కలగలిపి పనిచేసినా వాటి నికర బలం(effective force) శూన్యం. అందువల్ల భూమి భ్రమణ, పరిభ్రమణాల ప్రభావం మన మీద పడదు. అందువల్ల మనం కదలనట్టే భావిస్తాము.
www.bhaskerdesh.in