Friday 6 May 2016

గదిలో ఫ్యాన్‌ వేయగానే మనకు చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందువల్ల?

DB
ప్రశ్న: గదిలో ఫ్యాన్‌ వేయగానే మనకు చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందువల్ల?
జవాబు: ఫ్యాన్‌ వేయగానే చల్లగాలి వస్తుంది కానీ, ఆ గాలి కానీ, చల్లదనం కానీ ఫ్యానులో లేవు. నిజానికి ఫ్యాన్‌ వేయగానే గదిలోని గాలి వేడెక్కుతుంది. ఎందుకంటే గదిలోని గాలి అణువులలో కదలిక ఎక్కువై ఒకదానితో మరొకటి రాసుకోవడం వల్ల ఉష్ణం జనిస్తుంది. కాబట్టి ఫ్యాన్‌ గదిని చల్లబరచదు. ఫ్యాన్‌ గదిలోని గాలిని అన్ని దిశలకూ వేగంగా వ్యాపింపజేస్తుంది. అందువల్ల మన చర్మం ఉపరితలంపై ఉన్న చెమట ఆవిరవుతుంది. దీన్నే బాష్పీభవనం (Evaporation) అంటారు. ఈ ప్రక్రియలో మన శరీరంలోని వేడి తగ్గి మనకు చల్లగా ఉన్నట్లు అనిపిస్తుంది. మన చేతిపై అత్తరు చల్లుకున్నా చల్లగా అనిపించడాన్ని గమనించే ఉంటారు. ఇది కూడా బాష్పీభవనం వల్లనే. త్వరగా బాష్పీభవనం చెందే అత్తరులాంటి ద్రవాలు మన శరీరంలోని వేడిని గ్రహించి ఆవిరవడంతో ఇలా జరుగుతుంది. ఈ ప్రక్రియ ఎంత ఎక్కువగా, త్వరగా జరిగితే అంత చల్లదనాన్ని అనుభవిస్తాం. అందువల్లనే ఎండాకాలంలో చెమట ఎక్కువగా పట్టినప్పుడు ఫ్యాను వేసుకుంటే చల్లదనాన్ని ఎక్కువగా అనుభవిస్తాం.
www.bhaskerdesh.in