Saturday 6 August 2016

టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాలు ఏ తరంగాల వల్ల వస్తాయి? అవి ఎలా అనుసంధానం అవుతాయి?

ప్రశ్న: టీవీలో వచ్చే ప్రత్యక్ష ప్రసారాలు ఏ తరంగాల వల్ల వస్తాయి? అవి ఎలా అనుసంధానం అవుతాయి?

జవాబు: సాధారణంగా అన్ని రకాల టీవీ ప్రసారాలు మైక్రోవేవ్‌ తరంగాల ద్వారానే నిస్తంత్రీ (wireless) పద్ధతిలో ఒక చోట నుంచి మరోచోటికి ప్రసారం అవుతాయి. మనం సెల్‌ఫోన్‌కు వాడే టవర్లను ఉపయోగించి సెల్‌ఫోన్లలో ఫోన్‌ ఇన్‌ (phone-in) అనే ప్రక్రియ ద్వారా ఓ చోట విలేకరి చేసే వార్తాసమీక్షల్ని ఆయా టీవీల మాతృస్థానం (studio) వరకు చేరుస్తారు. ఏదైనా బాహ్యక్షేత్రం (outdoors) లో జరిగే క్రీడలు, ఉత్సవాలు, సభలు, సమీక్షలు వంటి వాటిని లైవ్‌టెలికాస్ట్‌ చేయాలంటే టీవీ వాళ్ల దగ్గరున్న ప్రత్యేక వాహనానికి అమర్చిన డిష్‌ల ద్వారా సూక్ష్మతరంగాల ప్రసరణ చేసి ఉపగ్రహాలకు సంధానించుకుంటారు. అక్కణ్నించి ప్రసార తరంగాలు వారి మాతృస్థానానికి చేరతాయి. దృశ్య పసారాలకు (వీడియో) మైక్రోవేవ్‌ తరంగాల్ని, శ్రవణ ప్రసారాలకు (ఆడియో) రేడియో తరంగాలను వాడటం పరిపాటి. ఈ రెంటి కలయిక (admixturing) సరిగాలేనపుడు టీవీలో మాట్లాడే వ్యక్తి పెదాల కదలికలకు, మాటలకు పొంతనలేకపోవడాన్ని గమనిస్తాము.

www.bhaskerdesh.in

అబద్ధం చెబితే పసిగట్టే లైడిటెక్టర్‌ ఎలా పనిచేస్తుంది?

ప్రశ్న: అబద్ధం చెబితే పసిగట్టే లైడిటెక్టర్‌ ఎలా పనిచేస్తుంది?

జవాబు: ఒక వ్యక్తి అబద్ధ్దం చెబుతున్నప్పుడు తనకు తెలియకుండానే భావావేశానికి, ఉద్వేగానికి లోనవుతాడు. అపుడు అతని శరీరంలో కొన్ని సున్నితమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సూత్రం ఆధారంగానే లైడిటెక్టర్‌ (Lie Detector)ను రూపొందించారు.?

ఇది మానవ శరీరంలో రక్తపోటు, గుండె చప్పుడు, శ్వాసక్రియ, చెమట పట్టడం లాంటి కొన్ని మార్పులను నమోదు చేస్తుంది. దీనిలో ఉండే న్యూమోగ్రాఫ్‌ ట్యూబు (pneumograph tube) అనే సన్నని రబ్బరు గొట్టాన్ని నిందితుని ఛాతీ చుట్టూ గట్టిగా కడతారు. ఒక పట్టీని రక్తపోటు కొలవడానికి జబ్బకు కడతారు. చర్మంలోని ప్రకంపనలను కొలవడానికి శరీర భాగాలలో కొద్ది మోతాదులో విద్యుత్‌ను ప్రవహింపజేసి అందులోని మార్పులను గ్రహించే ఏర్పాట్లు కూడా ఆ యంత్రంలో ఉంటాయి.

శరీరంలో కలిగే ప్రేరేపణలను, ఉద్వేగాలను సున్నితమైన ఎలక్ట్రోడుల ద్వారా గ్రహించి గ్రాఫు ద్వారా నమోదు చేస్తారు. ఈ యంత్రం ద్వారా లభించిన సమాచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషించడం ద్వారా నిందితుడు అబద్ధ్దమాడుతున్నాడా లేదా అనే అంశంపై ప్రాథమిక అవగాహనకు వస్తారు. న్యాయవ్యవస్థ దీన్ని నేర విచారణలో ఒక సాధనంగానే గుర్తిస్తుంది కానీ కేవలం అది అందించే సమాచారం ఆధారంగానే నేర నిర్ధారణ చేయరు. ఈ పరికరాన్ని 1921లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని జాన్‌లాగూన్‌ అనే వైద్య విద్యార్థి, ఒక పోలీసు అధికారి సాయంతో కనిపెట్టాడు.

www.bhaskerdesh.in

పచ్చని ఆకులలో పత్ర హరితం ఉంటుంది. మరి పచ్చని రంగుల్లో ఉండే పూలల్లో కూడా పత్రహరితమే ఉంటుందా? లేదా ఇతర పదార్థాల వల్ల వీటికి పచ్చని వర్ణం వస్తుందా? 


ప్ర : పచ్చని ఆకులలో పత్ర హరితం ఉంటుంది. మరి పచ్చని రంగుల్లో ఉండే పూలల్లో కూడా పత్రహరితమే ఉంటుందా? లేదా ఇతర పదార్థాల వల్ల వీటికి పచ్చని వర్ణం వస్తుందా? 

జ : ఆకుల పచ్చదనానికి, పువ్వుల్లో పచ్చదనానికి, మాగని అరటి, మామిడి, జామ, నిమ్మ వంటి పళ్ళతోళ్ల (peels) లో ఉండే పచ్చదానికి ప్రధాన వర్ణద్రవ్యం (pigment) క్లోరోఫిల్‌. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవజాతి అంతా క్లోరోఫిల్‌కు ఎంతో ఋణపడి ఉంది. దాని ద్వారానే సౌరశక్తి, కిరణజన్య సంయోగక్రియ (photosynthesis) ద్వారా జీవులన్నింటికీ అవసరమైన ఆహారంగా తయారవుతోంది. ముఖ్యముగా క్లొరోఫిల్ లో నాలుగు / ఐదు రకాలు ఉన్నాయి . కొద్దిగా రంగులో తేడా ఉన్నా దానిలో ఉన్న ముఖ్యమైన పిగ్మెంట్ .. క్లొరోఫిల్ జాబితాలోకే వస్తుంది . 

www.bhaskerdesh.in

మంట ఎలా మండుతుంది?


 ప్రశ్న: మంట ఎలా మండుతుంది?

జవాబు: మంట లేక అగ్నిజ్వాల అంటే పదార్థాల కలయిక వల్ల జరిగే రసాయనిక, భౌతిక మార్పులు. ఈ ప్రక్రియలో పదార్థాలు ఉష్ణ, కాంతి శక్తులతోపాటు పొగ, బూడిదలు కూడా విడుదలవుతాయి. విద్యుత్‌ తీగలపై ఉండే ప్లాస్టిక్‌ తొడుగులో ఉత్పన్నమయ్యే మంటలోనైనా, నూనె లాంటి పదార్థాల్లో ఏర్పడే మంటలోనైనా, మామూలుగా ఇంట్లోని పొయ్యిలో కట్టెలు, బొగ్గులతో ఏర్పడే మంటలోనయినా వాటికి కావలసిన ముఖ్యమైన అంశాలు మండే స్వభావం గల పదార్థం, ఆక్సిజన్‌, ఉష్ణాన్ని ఉత్పన్నం చేసే మీట. వీటిలో ఏ అంశం లేక పోయినా మంట ఏర్పడదు. ఈ సూత్రం పైనే మంటలు మండకుండా ఆర్పుతారు. మంటలార్పాలంటే వాటికి అందే ఆక్సిజన్‌ను తీసివేయాలి. మండే స్వభావం గల పదార్థాన్ని తొలగించాలి.

మండే పదార్థాలు ఘన, ద్రవ, వాయు రూపాలలో ఏ రూపంలోనైనా ఉండవచ్చు. ఉదాహరణకు కొయ్య, ప్లాస్టిక్‌(ఘన), నూనె(ద్రవ), హైడ్రొజన్లు(వాయు), ఉష్ణోగ్రతల విలువలు అత్యధికంగా ఉంటే, ఇనుములాంటి లోహాలు కూడా మండుతాయి. మంటకు కావలసిన ఆక్సిజన్‌ వాతావరణంలోని గాలి అందిస్తుంది. మంటను రాజేయడానికి కావలసిన శక్తి పదార్థాల మధ్య ఘర్షణ వల్ల ఉత్పన్నమయ్యే నిప్పు కణాల నుంచి, మెరుపుల నుంచి అందించవచ్చు.

www.bhaskerdesh.in

Friday 5 August 2016

చేపల తొట్టెలో చేపలు వేగంగా తిరుగుతున్నా అవి ఆ తొట్టె గోడలకు తగలకుండా ఎలా ఈదగలుగుతున్నాయి?

ప్రశ్న: చేపల తొట్టెలో చేపలు వేగంగా తిరుగుతున్నా అవి ఆ తొట్టె గోడలకు తగలకుండా ఎలా ఈదగలుగుతున్నాయి?

జవాబు: చేపలకు నీటిలో కదలికల వల్ల కలిగే ప్రచోదనాలను (Impulses) గుర్తించగల అతీంద్రయ శక్తి ఉంది. ఈ శక్తికి కారణమైన జ్ఞానేంద్రియం చేపల దేహంలో వాటి కంటి నుంచి తోక చివరి వరకు ఒక రేఖా రూపంలో వ్యాపించి ఉంటుంది. దీనిని 'పార్శ్వరేఖ' అంటారు. ఈ రేఖ అతి చిన్న రంధ్రాలు కలిగి చేపల దేహంలో ఒక పాలిపోయిన గీత రూపంలో ఉండి చేపల చర్మం కింద సన్నని గొట్టాల రూపంలో ఉండే న్యూరోమాస్ట్స్‌ అనే జీవకణాలతో కలుపబడి ఉంటుంది. ఈ కణాలు నీటిలో ఉత్పన్నమయ్యే అతి స్వల్పమైన కంపనాలను, కదలికలను చేపలు గ్రహించేటట్లు చేస్తాయి. అందువల్లే చేపల తొట్టెలో అవి ఎంత వేగంగా ఈదుతున్నా తొట్టె గోడలకు ఢీకొనకుండా ఉంటాయి. మురికి నీటిలో కూడా అవి వాటి మార్గాలకు అడ్డంకులు తగలకుండా ముందుకు పోగలుగుతాయి. ఈ అతీంద్రయ శక్తి వల్లే వాటిి సమీపానికి వచ్చే హానికరమైన ప్రాణుల లేక ఆహారానికి పనికి వచ్చే వాటి ఉనికిని, పరిమాణాన్ని అంచనా వేయగలవు.

www.bhaskerdesh.in

విద్యుత్తు ప్రసరించడం అంటే ఎలక్ట్రాన్లు ప్రవాహం అంటారు. పదార్థాల్లో ఎలక్ట్రాన్లు ఎలా ప్రయాణిస్తాయి?

ప్రశ్న: విద్యుత్తు ప్రసరించడం అంటే ఎలక్ట్రాన్లు ప్రవాహం అంటారు. పదార్థాల్లో ఎలక్ట్రాన్లు ఎలా ప్రయాణిస్తాయి? 

జవాబు: విద్యుత్ప్రసారం అంటే శాస్త్రీయంగా విద్యుదావేశం ఒక చోట నుంచి మరో చోటుకి స్థానభ్రంశం (displacement) చెందడమే. అంటే విధిగా ఎలక్ట్రాన్ల ప్రసారమే కానక్కర్లేదు. అయితే విద్యుత్‌ను ప్రసారం చేసే సాధనాల్లో దాదాపు 80శాతం ఎలక్ట్రాన్ల ప్రవాహమే.సాధారణంగా లోహాలు (metals), మిశ్రమలోహాలు (alloys), గ్రాఫైటు, బొగ్గు వంటి ఘనపదార్థాల్లోను, పాదరసం, బ్రోమీను వంటి ద్రవపదార్థాల్లోను విద్యుత్‌ ఎలక్ట్రాన్ల గమనం ద్వారానే సంభవిస్తుంది. రబ్బరు, కాగితం, ప్లాస్టిక్కు వంటి విద్యుత్‌ నిరోధక పదార్థాల్లో జరిగే కొద్దిపాటి విద్యుత్‌ ప్రసారం కూడా ఎలక్ట్రాన్ల మందకొడి ప్రవాహమే. అయితే ట్యూబ్‌లైట్లు, ద్రావణాలు, వాయువులు, నీరు వంటి సాధనాల్లో విద్యుత్‌ ప్రసారం ఎలక్ట్రాన్ల ప్రవాహంతో పాటు విద్యుదావేశిత కణాల (ions) ద్వారా కూడా జరుగుతుంది. ఎలక్ట్రాన్లు ప్రవహించడం ద్వారా విద్యుత్‌ ప్రసారం జరిగే పదార్థాలను ఎలక్ట్రానిక్‌ కండక్టర్లు అంటారు. ఇలాంటి పదార్థాల్లో సులభంగా అటూ, ఇటూ పరమాణువుల, అణువుల మధ్య కదలగల ఎలక్ట్రాన్లు ఉంటాయి. వీటినే వేలన్సీ ఎలక్ట్రాన్లు అంటారు. ఇలాంటివన్నీ కలగలిసి ఓ సందోహంలాగా అన్ని పరమాణువుల్ని కలుపుకుని దుప్పటిలాగా పైపైన ఉంటాయి. ఎటువైపున ఏమాత్రం ధనావేశిత ధ్రువం (ఆనోడ్‌) ఉన్నా అటువైపు చలిస్తాయి. అదే పదార్థానికి మరో వైపు రుణధ్రువం (కేథోడ్‌) కూడా ఉంటుంది. ఆనోడ్‌ ద్వారా పదార్థం నుంచి జారుకునే ఎలక్ట్రాన్లను కేథోడ్‌ నింపుకుంటుంది. ఇంటిపైన ఉండే వాటర్‌ ట్యాంకులో నీరు వేలన్సీ ఎలక్ట్రాన్ల దండు అనుకుంటే, కుళాయి ద్వారా బయటపడేవి ఆనోడు వైపు వెళ్తున్నట్లు, పంపు ద్వారా ట్యాంకును చేరేవి కేథోడ్‌ ద్వారా వచ్చేవని ఊహించుకోండి.

www.bhaskerdesh.in

ఆకాశంలో అంత ఎత్తులో గద్ద రెక్కలాడించకుండా ఎలా ఎగరగలుగుతుంది?

ప్రశ్న: ఆకాశంలో అంత ఎత్తులో గద్ద రెక్కలాడించకుండా ఎలా ఎగరగలుగుతుంది?

జవాబు: ఎండుటాకులు, దూదిపింజెలు, వెంట్రుకల లాంటి తేలికైన వస్తువులు గాలిలో తేలుతూ చాలా సేపు కింద పడకుండా ఉండడం తెలిసిందే. అదే రాయిలాంటి వస్తువులు పైనుంచి కిందకి తటాలున పడిపోవడం కూడా మనకు తెలుసు. ఎత్తు నుంచి కిందకి పడే వస్తువుపై గాలి వల్ల ఏర్పడే నిరోధక బలం పని చేస్తూ ఉంటుంది. దీని ప్రభావం ఆయా వస్తువుల సాంద్రత, పరిమాణం, బరువులాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. గద్ద విషయానికి వస్తే దాని రెక్కలు చాలా విశాలంగా ఉంటాయి. గద్ద పరిమాణం దాని బరువుతో పోలిస్తే చాలా ఎక్కువ. ప్యారాచూట్‌ కట్టుకున్నప్పుడు, గ్త్లెడర్‌ పట్టుకున్నప్పుడు మనుషులు ఎలాగైతే గాలిలో తేలుతూ ప్రయాణించగలరో గద్దకూడా అలా చేయగలదు. గద్ద ఆకాశంలోకి ఎగరడానికి మామూలుగానే రెక్కలు ఆడించినా, పైకి వెళ్లాక రెక్కలను విశాలంగా చాపి గాలి నిరోధాన్ని, గాలి వేగాన్ని ఉపయోగించుకుని బ్యాలన్స్‌ చేసుకుంటూ తన శక్తిని ఆదా చేసుకుంటుంది. మరింత ఎత్తుకు ఎగరాలంటే మాత్రం రెక్కలు అల్లల్లాడించవలసిందే.

www.bhaskerdesh.in

Thursday 4 August 2016

డాల్ఫిన్లు ఎలా నిద్రపోతాయి?

ప్రశ్న: డాల్ఫిన్లు ఎలా నిద్రపోతాయి?

జవాబు: డాల్ఫిన్లు నిద్రపోయేప్పుడు వృత్తాకార మార్గంలో ఈదుతూ ఉంటాయని శాస్త్రవేత్తలు ఎప్పుడో గుర్తించారు. అందుకు కారణం ఏమిటంటే అవి నిద్రపోయేప్పుడు వాటి మెదడులోని సగ భాగం మాత్రమే నిద్రావస్థను పొందుతుంది. అందువల్ల గుంపు నుంచి తప్పిపోకుండా ఉండడానికి అవి గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. డాల్ఫిన్లు మేల్కొని ఉన్నప్పుడు ఈల లాంటి శబ్దం చేయడం ద్వారా ఒకదాని ఉనికిని మరొకటి సులువుగా తెలుసుకోగలుగుతాయి. కానీ నిద్రపోయేప్పుడు అలాంటి శబ్దాలు చేస్తే శత్రుజీవులు వచ్చి దాడి చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల అవి నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎలాంటి శబ్దాలు చేయకుండా వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటాయి. అవి గుంపుగా ఈదుతుండడంతో శత్రుజీవులు దగ్గరకు రావు.

www.bhaskerdesh.in

ఎడారుల్లో ఉండే ప్రాణులేంటి? అవి అక్కడ ఎలా జీవించగలుగుతాయి?

ప్రశ్న: ఎడారుల్లో ఉండే ప్రాణులేంటి? అవి అక్కడ ఎలా జీవించగలుగుతాయి?

జవాబు: నీరు అత్యల్పంగా దొరికే ఇసుక నేలలతో కూడిన ఎడారుల్లో జీవనం కష్టమని అనిపించినా, ఆ పరిసరాలకు అనుగుణంగా బతికే మొక్కలు, జీవులు ఉంటాయి. ఎడారుల్లో ఎక్కువగా నత్తలుంటాయి. వీటితో పాటు బల్లులు, పాములు, ఎలుకలు, తొండలు, గుడ్లగూబలు, కీటకాలు ఉంటాయి. ఇలాంటి ఎడారి జీవుల్లో చెమట, మూత్రం ఎక్కువగావెలువడని శరీర నిర్మాణం వల్ల వాటికి నీటి అవసరం చాలా తక్కువగా ఉంటుంది. ఎడారి మొక్కలైన ముళ్లపొదలు, కాక్టస్‌లాంటి మొక్కలకు ఆకులు తక్కువగా ఉండడం వల్ల వాటిలోని నీరు త్వరగా ఆవిరి కాదు. అరుదుగా వర్షాలు పడినా ఇవి ఆ నీటిని కాండాల్లో నిల్వ చేసుకోగలుగుతాయి. ఇక ఎడారి ఓడగా పేరొందిన ఒంటె అక్కడి ముళ్లపొదల్ని మేయగలదు. దీని మూపురంలో కొవ్వు పదార్థం పేరుకుని ఉండి శక్తినిస్తూ ఉంటుంది. ఒంటె ఒకేసారి 25 గ్యాలన్ల వరకూ నీరు తాగి దాన్ని శరీరంలో నిల్వ చేసుకోగలదు. ఎడారి జీవుల్లో ఎక్కువ బొరియల్లో జీవించేవి కావడం వల్ల అత్యధికమైన వేడి వాటిని బాధించదు.

www.bhaskerdesh.in

చీమ తన బరువుకన్నా 50 రెట్లు ఎక్కువ బరువును కూడా లేపుతుందట. మనిషి అలా చేయలేడెందుకు?

ప్రశ్న: చీమ తన బరువుకన్నా 50 రెట్లు ఎక్కువ బరువును కూడా లేపుతుందట. మనిషి అలా చేయలేడెందుకు?

జవాబు: బరువు ఎత్తడం ఎత్తకపోవడం అనే విషయం కేవలం చిన్న ప్రాణి, పెద్ద ప్రాణి అన్న లక్షణానికే పరిమితం కాలేదు. శరీర నిర్మాణం, నేలకు బరువుకు మధ్య ఉన్న దూరం, ఎన్ని బిందువుల మీద నేలకు శరీరం తాకి ఉంది అన్న అనేక విషయాలు బరువు నెత్తే సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. చీమ ఆర్థ్రోపొడ (కీళ్లు అధికంగా ఉన్న కాళ్లుగల) వర్గంలో కీటకాల తరగతికి చెందిన జీవి. ఇది చతుష్పాది (tetrapod) అంటే తాను ఎత్తే బరువు నాలుగు కాళ్ల మీదికి విభజన అవుతుంది. పైగా కాళ్లు గట్టిగా ఉన్న కైటిన్‌ అనే ప్రోటీన్‌ నిర్మితం. కాబట్టి తన బరువు కన్నా చాలా రెట్లు అధికంగా ఉన్న బరువును కూడా కొంత దూరం పైకి ఎత్తి పట్టుకోగలదు. తాను ఎత్తే బరువుకు నేలకు మధ్య ఉన్న దూరం కూడా తక్కువే ఉండడం వల్ల తనకు అవసరమయ్యే శక్తి కూడా తక్కువే ఉంటుంది. ఎందుకంటే పైకెత్తబడిన వస్తువు స్థితి శక్తి (potential energy) mgh ని కలిగివుంటుందని, దాన్ని ఎమ్‌జీహెచ్‌గా కొలుస్తారని తరగతుల్లో చదివే ఉంటారు. ఇక్కడ mg అంటే బరువు, h అంటే ఎత్తు అని అర్థం. కానీ మనిషి ద్విపాది (bipod). రెండు కాళ్ల మీదే భారమంతా పడుతుంది. కాబట్టి శరీర పరిమాణంతో పోల్చితే నాలుగు కాళ్లున్న చీమ రెండు కాళ్లున్న మనిషికన్నా ఎక్కువ బరువు ఎత్తడంలో ఆశ్చర్యం లేదు. అయితే చీమ తన బరువు కన్నా అయిదారు రెట్ల బరువును మాత్రమే ఎత్తగలదు కానీ 50 రెట్లు అధిక బరువును ఎత్తగలదనడంలో నిజం లేదు. 

www.bhaskerdesh.in