Sunday 15 May 2016

సైకిల్‌ ట్యూబ్‌ పంక్చర్‌ అయినప్పుడు అందులోంచి బయటకి వచ్చే గాలి ఎందుకు చల్లగా ఉంటుంది?

ప్రశ్న: సైకిల్‌ ట్యూబ్‌ పంక్చర్‌ అయినప్పుడు అందులోంచి బయటకి వచ్చే గాలి ఎందుకు చల్లగా ఉంటుంది?

జవాబు: ఇందుకు కారణం వాయువుల ధర్మాలకు సంబంధించిన సూత్రం. ఎక్కువ పీడనంలో ఉన్న వాయువు అక్కడి నుంచి తక్కువ పీడనం ఉండే ప్రదేశానికి అతి సన్నని మార్గం ద్వారా ప్రవహించినప్పుడు ఆ వాయువు చల్లబడుతుంది. దీన్ని భౌతిక శాస్త్రంలో ఔల్‌-థామ్సన్‌ ఫలితం అంటారు. సైకిల్‌ ట్యూబ్‌ పంక్చర్‌ అయినప్పుడు ఇదే జరుగుతుంది. సైకిల్‌ టైరులో అమర్చిన ట్యూబ్‌లోకి ఎక్కించిన గాలి బయటి వాతావరణంలోని గాలితో పోలిస్తే, ఎక్కువ పీడనాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు ట్యూబ్‌కు పంక్చర్‌ అయినప్పుడు, లోపల అధిక పీడనంతో ఉండే గాలి సన్నని రంధ్రం ద్వారా తక్కువ పీడనం ఉండే ప్రదేశానికి వస్తుంది. అలా రంధ్రం ద్వారా గాలి వేగంగా బయటకు రావడానికి ఆ వాయువ్యవస్థ కొంత పని చేయాల్సి ఉంటుంది. ఈ పని చేయడానికి కావలసిన శక్తి, బయటకి పోయే గాలిలో ఉండే ఉష్ణశక్తి నుంచి లభిస్తుంది. అందువల్ల ఉష్ణోగ్రత తగ్గి ఆ గాలి చల్లబడుతుంది.