Monday 23 May 2016

చిన్న వయసులోనూ కొంతమందికి తెల్ల జుత్తు వస్తుంది ఎందువల్ల?


 ప్రశ్న:చిన్న వయసులోనూ కొంతమందికి తెల్ల జుత్తు వస్తుంది ఎందువల్ల?

జవాబు: మన తలపై ఉండే వెంట్రుకలు ఏక కాలంలో రెండు రకాలుగా ఉపయోగపడతాయి. పరిసరాల్లో ఉన్న ఉష్ణాన్ని బాగా గ్రహించి శరీరంలోకి చేరకుండా చేసే మంచి ఉష్ణ గ్రాహణి (heat absorber)గాను, శరీరంలో విడుదలయిన వేడి త్వరితంగా వాతావరణంలోకి పంపగల మంచి ఉష్ణ ఉద్గారిణి (heat emitter) గాను అవి పనిచేస్తాయి. మరి ఆ వెంట్రుకలకు నల్లని రంగు ఎలా వచ్చింది? చర్మం పైపొర కిందున్న డెర్మిస్‌ అనే పొరలో కేశ గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు తెల్లగా నైలాన్‌ దారంలా ఉండే ప్రోటీను తీగల్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ ప్రోటీను తీగల తయారీ సమయంలోనే కేశ గ్రంథులకు దగ్గరే ఉన్న కణాల్లోని మెలనిన్‌ అనే నల్లని వర్ణ రేణువులు ఆ ప్రోటీను అణువుతో లంకె వేసుకుంటూ వెంట్రుకతో పాటు బయట పడతాయి. అందువల్లనే తెల్లగా ఉండవలసిన వెంట్రుక ప్రోటీను తీగ నల్లగా కనిపిస్తుంది.

ఈ మెలనిన్‌ రేణువులకు సాధారణ కాంతినే కాకుండా అరుదుగానైనా సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల్ని కూడా శోషించుకునే లక్షణం ఉంది. వెంట్రుకల ఉత్పత్తి ఆగకున్నా మెలనిన్‌ రేణువులు సరిగా ఉత్పత్తి కాకుంటే వయసు చిన్నదయినా తెల్లని వెంట్రుకలే తలపై ఉంటాయి. వృద్ధాప్యంలో ఈ మెలనిన్‌ రేణువుల ఉత్పత్తి తక్కువ అవుతుంది కాబట్టి ముసలి వారి వెంట్రుకలు తెల్లబడతాయి. సౌర కాంతి అధికంగా లేని పశ్చిమోత్తర (northwest) ప్రజల వెంట్రుకలు కూడా తెల్లగా ఉంటాయి.

www.bhaskerdesh.in