Tuesday 24 May 2016

తల వెంట్రుకలు ఎలా రూపొందుతాయి?

ప్రశ్న:
తల వెంట్రుకలు ఎలా రూపొందుతాయి?

జవాబు:
పరిణామ క్రమంలో జంతువులు ఏర్పడ్డాక అవి పరిసరాలలోని ఉష్ణం, శీతలం, తేమ, సూక్ష్మజీవుల తాకిడి లాంటి పరిస్థితుల నుంచి రక్షణ పొందడానికి చర్మం మీద బొచ్చు ఏర్పడ్డం ప్రారంభమైంది. చర్మంలో ప్రధానంగా బయటి పొర (exodermis), లోపలి పొర (endodermis) అనే రెండు పొరలుంటాయని చదువుకుని ఉంటారు. చర్మం లోపలి పొర పలుచని కండరాలతో కూడి ఉంటుంది. ఇందులో పాదుల్లాంటి గుళికలు ఉంటాయి. వీటినే రోమస్థావరాలు (hair follicles) అంటారు. ఎలాగైతే వరి, జొన్నలాంటి మొక్కలు నేలపాదుల్లో గట్టిగా వేళ్లూనికుని పైకి ఎదుగుతాయో అలాగే ఈ కేశ స్థావరాల్లోంచి వెంట్రుకలు మొలిచి చర్మం బయటి పొర దాటి పైకి వస్తాయి. వెంట్రుకల్లో ఉండేది ఓ విధమైన ప్రొటీన్లు. వీటిని రసాయనికంగా ఆల్ఫా కెరోటీన్లు అంటారు. గంధకం కూడా ఓ అంశంగాగల సిస్టీన్‌ అనే ఆమైనో ఆమ్లం ప్రధానంగా ఉండే ప్రొటీన్లు ఇవి. ఈ ప్రొటీన్లతో పాటు మెలనిన్‌ అనే వర్ణ రేణువులు (pigments) విస్తారంగా ఉంటే ఆ వెంట్రుకలు నల్లగా ఉంటాయి. అవి లేనివి తెల్లగా ఉంటాయి.

www.bhaskerdesh.in