Saturday 23 July 2016

వాతావరణంలోని తేమను ఎలా కొలుస్తారు?


 
ప్రశ్న: వాతావరణంలోని తేమను ఎలా కొలుస్తారు?

జవాబు: గాలిలో ఉండే తేమను ఆర్ద్రత అంటారు. ఈ ఆర్ద్రతను రెండు విధాలుగా విభజింపవచ్చు. ఒకటి పరమ ఆర్ద్రత. రెండోది సాపేక్ష ఆర్ద్రత. ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉండే తేమను పరమ ఆర్ద్రత అంటారు. ప్రస్తుతం ఉండే ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉండే తేమను సంతృప్తీకరణం చేయడానికి కావలసిన తేమ శాతాన్ని సాపేక్ష ఆర్ద్రత అంటారు.

ఆర్ద్రతను హైగ్రోమీటర్‌ అనే పరికరంతో కొలుస్తారు. ఈ హైగ్రోమీటర్లు హెయిర్‌ హైగ్రోమీటర్‌, కెపాసిటివ్‌ హైగ్రోమీటర్‌ అని రెండు రకాలు. సాపేక్ష ఆర్ద్రతను కొలిచే హెయిర్‌ హైగ్రోమీటర్‌లో వెంట్రుకలు ఒక కుచ్చు రూపంలో ఉంటాయి. గాలిలో తేమను పీల్చుకున్నపుడు ఆ వెంట్రుకలు సాగుతాయి. అపుడు పరికరంలో ఉండే అతి సున్నితమైన యాంత్రిక వ్యవస్థ వెంట్రుకల పొడవులోని మార్పును ఒక స్కేలుపై చలనంలో ఉండే సూచికకు అందజేస్తుంది. స్కేలుపై ఆర్ద్రతల విలువలు విభాగాల రూపంలో ఉంటాయి. ఉష్ణోగ్రతలలో స్వల్ప మార్పులను సునిశితంగా గ్రహించే సామర్థ్యం ఉండటం వల్ల స్త్రీల తల వెంట్రుకలను ఈ పరికరంలో వాడతారు.

పరమ ఆర్ద్రతను కొలిచే కెపాసిటివ్‌ హైగ్రో మీటర్‌లో గాలిలోని ఆర్ద్రతను కొలవడానికి విద్యుచ్ఛక్తిని వాడతారు. ఈ పరికరంలో ఒక కండెన్సర్‌ ఉంటుంది. కండెన్సర్‌లో సమాంతరంగా ఉండే విద్యుత్‌ వాహకాలైన రెండు పలకల మధ్య ఉండే టెన్షన్‌ మార్పుల ఆధారంగా ఆర్ద్రతను కొలుస్తారు. ఆర్ద్రత అంటే గాలిలో తేమ తగ్గే కొలదీ కండెన్సర్‌ పలకల మధ్య టెన్షన్‌ తగ్గుతుంది.