Saturday 23 July 2016

టీవీ తెరపై దుమ్మును గుడ్డతో తుడిచేప్పుడు మన చేతి మీద వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకని?

ప్రశ్న:
టీవీ తెరపై దుమ్మును గుడ్డతో తుడిచేప్పుడు మన చేతి మీద వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకని?

జవాబు:
అది స్థిర విద్యుత్‌ (static electricity) ప్రభావం. ప్రతి పదార్థంలో పరమాణువులు ఉంటాయి. వాటి కేంద్రకం (nucleus)లో ధనావేశంతో ఉండే ప్రోటాన్లు, ఏ ఆవేశం లేని న్యూట్రాన్లు కట్టగట్టుకుని ఉంటే, ఆ కేంద్రకం చుట్టూ రుణావేశం ఉండే ఎలక్ట్రాన్లు కక్ష్యల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఒక పరమాణువులో ఎన్ని ప్రోటాన్లు ఉన్నాయో, అన్నే ఎలక్ట్రాన్లు ఉంటాయి. కేంద్రకం నుంచి దూరంగా ఉండే కక్ష్యలో తిరిగే ఎలక్ట్రాన్లపై కేంద్రకం ఆకర్షణ ప్రభావం తక్కువగా ఉంటుంది.

ఇక టీవీ తెర విషయానికి వస్తే, దాన్ని ఏదైనా గుడ్డతో తుడిచేప్పుడు తెరమీది పరమాణువులు, గుడ్డలోని పరమాణువుల మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. ఆ ఘర్షణశక్తిని తెర పరమాణువుల బాహ్య కక్ష్యలో ఉండే ఎలక్ట్రాన్లు గ్రహించి, తెర నుంచి విడివడి గుడ్డలో ఉండే పరమాణువుల బాహ్య కక్ష్యను చేరుకుంటాయి. ఎలక్ట్రాన్లను కోల్పోయిన తెర ఉపరితలపు పరమాణువులలో ధనావేశం ఉండే ప్రోటాన్ల సంఖ్య ఎక్కువవడంతో తెర ధన విద్యుదావేశాన్ని పొందుతుంది. ఎలక్ట్రాన్లను పొందిన గుడ్డ రుణ విద్యుదావేశాన్ని పొందుతుంది. మనం వాడే గుడ్డ స్వభావాన్ని బట్టి ఈ విద్యుదావేశాలు తారుమారు కూడా కావచ్చు. అంటే ఏదైనా రెండు పదార్థాలను ఘర్షణకు గురి చేస్తే వాటికి విద్యుదావేశం వస్తుంది. అలా ధన విద్యుదావేశం పొందిన తెర ఉపరితలం తిరిగి తన యధాస్థితిని పొందడానికి మన చేతిపై ఉండే పరమాణువుల ఉంచి ఎలక్ట్రాన్లను గ్రహించే ప్రయత్నం చేస్తుంది. అందువల్లనే చేతి మీది వెంట్రుకలు తెరవైపు లాగినట్టయి నిక్కబొడుచుకుంటాయి. గాలి నింపిన బెలూనును బాగా రుద్ది వదిలేసినా అది మన దేహానికి అంటిపెట్టుకుని ఉంటుంది. దీనికి కూడా కారణం ఇదే.