Friday 5 August 2016

విద్యుత్తు ప్రసరించడం అంటే ఎలక్ట్రాన్లు ప్రవాహం అంటారు. పదార్థాల్లో ఎలక్ట్రాన్లు ఎలా ప్రయాణిస్తాయి?

ప్రశ్న: విద్యుత్తు ప్రసరించడం అంటే ఎలక్ట్రాన్లు ప్రవాహం అంటారు. పదార్థాల్లో ఎలక్ట్రాన్లు ఎలా ప్రయాణిస్తాయి? 

జవాబు: విద్యుత్ప్రసారం అంటే శాస్త్రీయంగా విద్యుదావేశం ఒక చోట నుంచి మరో చోటుకి స్థానభ్రంశం (displacement) చెందడమే. అంటే విధిగా ఎలక్ట్రాన్ల ప్రసారమే కానక్కర్లేదు. అయితే విద్యుత్‌ను ప్రసారం చేసే సాధనాల్లో దాదాపు 80శాతం ఎలక్ట్రాన్ల ప్రవాహమే.సాధారణంగా లోహాలు (metals), మిశ్రమలోహాలు (alloys), గ్రాఫైటు, బొగ్గు వంటి ఘనపదార్థాల్లోను, పాదరసం, బ్రోమీను వంటి ద్రవపదార్థాల్లోను విద్యుత్‌ ఎలక్ట్రాన్ల గమనం ద్వారానే సంభవిస్తుంది. రబ్బరు, కాగితం, ప్లాస్టిక్కు వంటి విద్యుత్‌ నిరోధక పదార్థాల్లో జరిగే కొద్దిపాటి విద్యుత్‌ ప్రసారం కూడా ఎలక్ట్రాన్ల మందకొడి ప్రవాహమే. అయితే ట్యూబ్‌లైట్లు, ద్రావణాలు, వాయువులు, నీరు వంటి సాధనాల్లో విద్యుత్‌ ప్రసారం ఎలక్ట్రాన్ల ప్రవాహంతో పాటు విద్యుదావేశిత కణాల (ions) ద్వారా కూడా జరుగుతుంది. ఎలక్ట్రాన్లు ప్రవహించడం ద్వారా విద్యుత్‌ ప్రసారం జరిగే పదార్థాలను ఎలక్ట్రానిక్‌ కండక్టర్లు అంటారు. ఇలాంటి పదార్థాల్లో సులభంగా అటూ, ఇటూ పరమాణువుల, అణువుల మధ్య కదలగల ఎలక్ట్రాన్లు ఉంటాయి. వీటినే వేలన్సీ ఎలక్ట్రాన్లు అంటారు. ఇలాంటివన్నీ కలగలిసి ఓ సందోహంలాగా అన్ని పరమాణువుల్ని కలుపుకుని దుప్పటిలాగా పైపైన ఉంటాయి. ఎటువైపున ఏమాత్రం ధనావేశిత ధ్రువం (ఆనోడ్‌) ఉన్నా అటువైపు చలిస్తాయి. అదే పదార్థానికి మరో వైపు రుణధ్రువం (కేథోడ్‌) కూడా ఉంటుంది. ఆనోడ్‌ ద్వారా పదార్థం నుంచి జారుకునే ఎలక్ట్రాన్లను కేథోడ్‌ నింపుకుంటుంది. ఇంటిపైన ఉండే వాటర్‌ ట్యాంకులో నీరు వేలన్సీ ఎలక్ట్రాన్ల దండు అనుకుంటే, కుళాయి ద్వారా బయటపడేవి ఆనోడు వైపు వెళ్తున్నట్లు, పంపు ద్వారా ట్యాంకును చేరేవి కేథోడ్‌ ద్వారా వచ్చేవని ఊహించుకోండి.

www.bhaskerdesh.in