Monday 3 October 2016

Sodium (11)

సోడియమ్ (ఆంగ్లం: Sodium) ఒక క్షార లోహము. దీన్ని 'Na' (లేటిన్ - నేట్రియమ్) అనే సంకేతముతో సూచిస్తారు. సోడియమ్ పరమాణు సంఖ్య -11, పరమాణు భారము - 22.9898 గ్రా/మోల్, ఆక్సీకరణ సంఖ్య +1. దీని ఒకే ఒక ఐసోటోపు - 23Na. కరిగించినసోడియం హైడ్రాక్సైడ్ గుండా విద్యుత్ ప్రసరింపజేయడం ద్వారా సర్ హంఫ్రీ డేవీ 1807 లో మొదటిసారిగా ఈ మూలకాన్ని స్వచ్చమైన రూపంలో విడదీయగలిగాడు. సోడియం చాలా త్వరగా వాతావరణంలో ఆక్సీకరణం చెందుతుంది మరియు నీటితో ఉధృతంగా చర్య జరుపుతుంది కావున దీనిని కిరోసిన్ వంటి ద్రావణంలో సాధారణంగా భద్రపరుస్తారు. ఇది ప్రకృతిలో సమ్మేళనాలుగా చాలా విస్తారంగా ఉంటుంది. సముద్రజలంలో 2.0 నుంచి 2.9 సోడియం క్లోరైడ్ (సాధారణ ఉప్పు) శాతం ఉంటుంది. జీవులన్నింటికి సోడియం ఒక కీలకమైన మూలకం.

సోడియమ్ ధర్మాలు

భౌతిక ధర్మాలు

సోడియమ్ చాలా మెత్తని లోహం. తాజాగా కోసిన సోడియమ్ వెండి లాగా తెల్లగా మెరుస్తూ ఉంటుంది. గాలిలో ఉంచినప్పుడు త్వరగా నల్లబడుతుంది. అందువల్ల దీన్ని కిరోసిన్ వంటి జడ ద్రావణాలలో నిల్వ చేస్తారు. దృగ్గోచర వర్ణపటంలో పసుపు ప్రాంతంలో దాని స్వాభావికమైన D1, D2 (588.9950 and 589.5924 nm) ఉద్గార రేఖలను ఇస్తుంది. మెర్క్యూరీతో ఎమాల్గమ్ ను ఏర్పరుస్తుంది.

రసాయన ధర్మాలు

తడిగాలిలో సోడియమ్ తళుకు పోగొట్టుకొంటుంది. సోడియమ్ ఆక్సైడ్, హైడ్రాక్సైడ్, చివరికి కార్బొనేట్ లు మెల్లిగా ఏర్పడటంవల్ల తెల్లని పొడిగా మారుతుంది.సోడియమ్ నీటితో ఉధృతంగా చర్య జరిపి హైడ్రోజన్ నిస్తుంది. చర్యోష్ణం వల్ల కరిగిన సోడియమ్ నీటి పై కదలాడుతూ చివరకు మండుతుంది.హైడ్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరీన్ లతో సంయోగం చెంది ద్విఘటక సమ్మేళనాలనిస్తుంది.మలినాలు, ఉత్ప్రేరకాలు లేకుంటే సోడియమ్ శుద్ధ అమ్మొనియా ద్రవంలో కరిగి ముదురు నీలిరంగు ద్రావణాన్నిస్తుంది. అయితే ఇనుము వంటి ఉత్ప్రేరకాలుగాని, మలినాలు గాని ఉన్నప్పుడు సోడియమ్ ఎమైడ్ (సోడమైడ్), హైడ్రోజన్ లను ఇస్తుంది.సోడియమ్ బలమైన క్షయకరణి. చాలా సమ్మేళనాలను ఇది క్షయకరణం చేస్తుంది.