Wednesday 26 October 2016

Rhodium (45)

రోడియం కూడ రుథీనియం లాంటి రసాయన మూలకమే. దీని రసాయన హ్రస్వనామం Rh. దీని అణు సంఖ్య 45; అనగా దీని అణు కేంద్రకంలో 45 ప్రోటానులు ఉంటాయి. ఇది ఆవర్తన పట్టికలో 9వ నిలువు వరుస (గ్రూప్‌) లో కనిపిస్తుంది. రోడియం కి ఉన్న ఒకే ఒకసమస్థాని (isotope) ఉంది: 103Rh. విలియం ఓల్స్‌టన్‌ (en:William Hyde Wollaston) ఈ మూలకాన్ని 1804 లో కనుక్కున్నారు.

గ్రీకు భాషలో రోడియం అంటే ఎరుపు లేదా గులాబి రంగు అనే అర్థం ఉంది. రోడియం లవజనులతో కలవగా వచ్చిన లవణాలు ఇలాంటి ఎరుపు రంగులో ఉంటాయి కనుక ఈ పేరు వచ్చింది కాని, రోడియం చూడడానికి వెండిలా ఉంటుంది. ఈ మూలకం పెల్లేడియం దొరికే ఖనిజపు రాళ్లల్లోనే, కల్తీ సరుకులా, స్వల్పమైన పాళ్లల్లో దొరుకుతుంది. సాలీనా దీని ఉత్పాదన 20 టన్నులకి మించదు. ఇది అపురూపమైన (precious) లోహాలన్నిటిలోకి ఎక్కువ విలువైనది. అంతే కాకుండా ఈ లోహం ఉదాత్తమైన (noble) లోహం; అనగా, తుప్పు పట్టదు, గాఢ ఆమ్లాలలో కరగదు.

ఉపయోగాలు

1) కొన్ని రకాల రసాయన సంయోగాలని త్వరితపరచడానికి దీనిని ఉత్ప్రేరకి catalyst గా ఉపయోగిస్తారు.                         2) కారులు విసర్జించే అపాన వాయువులలో ఉన్న కల్మషాలని కడిగి శుభ్రం చెయ్యడానికి వాడే "కెటాలిటిక్‌ కన్వర్టర్‌" లలో దీనిని ఎక్కువ వాడుతున్నారు.             3) పలచటి రేకులా చేసి ఎక్సు-కిరణాలని గలనం చెయ్యడానికి రోడియంని ఉపయోగిస్తారు.        4) గుండె సరిగ్గా కొట్టుకోకపోతే హృదయ స్పందనని క్రమబద్ధం చెయ్యడానికి వాడే "పేస్ మేకర్" లలో వాడే సన్నని తీగని చెయ్యడానికి కూడ రోడియంని ఉపయోగిస్తారు.                          5) కొన్ని లోహా.లు తుప్పు పట్టకుండా ఉండడానికి పైపూతగా వాడే మలామాని తయారు చెయ్యడానికి కూడ రోడియంని వాడతారు.                                 6) అణుశక్తి ఉత్పాదక కేంద్రాలలో నూట్రాన్ అభిప్రవాహాల (flux) మట్టాన్ని పసికట్టడానికి వాడే పత్తాసుల (detectors) నిర్మాణంలో కూడ దీనికి ఉపయోగం ఉంది.