Wednesday 26 October 2016

Palladium (46)

పెల్లేడియం, ప్లేటినం, రోడియం, రుథీనియం, ఇరిడియం, ఆస్మియం - ఈ ఆరు రసాయన మూలకాలని ప్లేటినం గ్రూపు లోహాలు అంటారు. వీటి లక్షణాలలో గట్టి పోలికలు ఉన్నాయి; పెల్లేడియం వీటన్నిటిలో తక్కువ ఉష్ణోగ్రత దగ్గర కరుగుతుంది, అన్నిటి కంటే తక్కువ సాంద్రత కలది. పెల్లేడియం రసాయన హ్రస్వనామం Pd, అణు సంఖ్య 46. అరుదుగా లభించే, వెండిని పోలిన ఈ మూలకం ఉనికిని 1803లో విలియం హైడ్‌ ఒలాస్టన్‌ (William Hyde Wollaston) కనుక్కున్నారు. ఆ రోజుల్లోనే ఆవిష్కరణ పొందిన నభోమూర్తి పేలస్ (Pallas) గ్రహం అనుకుని ఆ గ్రహం గౌరవార్థం ఈ మూలకానికి పెల్లేడియం అని పేరు పెట్టడం జరిగింది. దరిమిలా పేలస్‌ గ్రహం కాదనీ, కేవలం గ్రహశకలం(planetoid or asteroid) అనీ తెలిసింది కాని అప్పటికే పెల్లేడియం పేరు స్థిరపడిపోయింది.

పెల్లేడియం, దాని సహజాతి మూలకం అయిన ప్లేటినం, ఎక్కువగా కారుల నుండి బయటకి వచ్చే అపాన వాయువులని (అనగా, ఉదకర్బనాలు, కార్బన్ మోనాక్సైడ్‌, నైట్రొజన్‌ డైఆక్సైడ్‌) శుద్ధి చెయ్యడానికి వాడతారు. ఈ రెండు మూలకాల ఉత్పత్తిలో దరిదాపు 90 శాతం కెటాలిటిక్ కన్‌వర్టర్లు తయారీలోనే ఖర్చు అయిపోతుంది. పెల్లేడియంని వైద్యుత పరికరాల ఉత్పత్తిలోను, దంతవైద్యం లోనూ, ఉదజని వాయువుని శుద్ధి చెయ్యడానికి, భూజలాన్ని శుద్ధి చెయ్యడానికి, నగల తయారీలోను కూడా వాడతారు. పెల్లేడియంని ఇంధన ఘటాల (fuel cells) తయారీలో కూడా వాడతారు. ఇంధన ఘటాలు ఉదజనిని, ఆమ్లజనిని సంయోగపరచి విద్యుత్తుని, వేడిని పుట్టించి, నీటిని విడుదల చేస్తాయి.

ఈ జాతి ఖనిజాలు అరుదుగా దొరుకుతున్నాయి. దక్షిణ ఆఫ్రికా లోని ట్రాస్వాల్‌ రాష్ట్రంలోను, అమెరికాలో మొన్‌టానా రాష్ట్రంలోను, కెనడాలోని అంటారియో రాష్ట్రంలోను, రష్యాలోను కొన్ని భూగర్భ నిధులు ఉన్నాయి.